Gyanvapi: జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది. వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అలహాబాద్ కోర్టు నిరాకరించింది. పూజలు నిర్వహించొద్దని మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పును వెలువరించారు. అంతకుముందు హిందూ, ముస్లిం పక్షాల పిటిషన్లపై ధర్మానసం సుదీర్ఘంగా చర్చించి.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వారణాసి కోర్టు తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. హిందూ భక్తులను మసీదు ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు.
జ్ఞానవాపి కాంప్లెక్స్ బెస్‌మెంట్‌లో నాలుగు సెల్లార్లు
జనవరి 31న జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందూ పక్షం ప్రార్థనలు చేయవచ్చని వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో జ్ఞానవాపి మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వారణాసి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఫిబ్రవరి 1న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మసీదు కమిటీ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన వెంటనే ఈ పిటిషన్ దాఖలైంది. జ్ఞానవాపి కాంప్లెక్స్ బెస్‌మెంట్‌లో నాలుగు 'తహ్ఖానాలు' (సెల్లార్లు) ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న వ్యాస్ కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో కాంప్లెక్స్‌లోని నాలుగు సెల్లార్లలో పూజలు చేసే హక్కు ఎవరికీ లేదని మసీదు కమిటీ చెబుతోంది.