HMDA: మరోసారి హెచ్‌ఎండీఏ భూముల వేలం.. హకీంపేట భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగర పరిధిలోని విలువైన భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ మరోసారి ఆన్‌లైన్ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్లతో పాటు కొన్ని కీలక భూపార్సిళ్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ వేలంలో అత్యంత ప్రాధాన్యం పొందిన భూమి షేక్‌పేట్ మండలం హకీంపేట గ్రామంలో ఉంది. సర్వే నంబరు 102/1లో ఉన్న 8 ఎకరాల 24కుంటల భూమికి హెచ్‌ఎండీఏ రికార్డు స్థాయిలో కనీస ధర నిర్ణయించింది. ఎకరాకు రూ.99 కోట్ల చొప్పున ధర ఖరారు చేయడంతో మొత్తం భూమి విలువ దాదాపు రూ.851కోట్లకు చేరింది. ఈ ఒక్క భూపార్సిల్ ద్వారానే దాదాపు రూ.1000కోట్ల వరకు ఆదాయం పొందాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
మేడిపల్లి లేఅవుట్‌లో 68 ప్లాట్ల విక్రయం
ఇక శంకర్‌పల్లి పరిధిలోని మోకిలా లేఅవుట్‌లో సర్వే నంబరు 96/ఏలో 100 ప్లాట్లను వేలానికి ఉంచారు. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 300 నుంచి 500 చదరపు గజాల వరకు ఉండగా,కనీస ధరను చదరపు గజానికి రూ.50 వేలుగా నిర్ణయించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి లేఅవుట్‌లో 68 ప్లాట్లను విక్రయించనున్నారు. వీటి విస్తీర్ణం 231 నుంచి 643 చదరపు గజాల వరకు ఉంది.ఇక్కడ చదరపు గజానికి కనీస ధర రూ.45 వేలు గా నిర్ణయించారు. శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని సర్వే నంబరు 174లో 484 చదరపు గజాల భూమికి చదరపు గజానికి రూ.60 వేల కనీస ధర నిర్ణయించారు.
వివరాలు
బౌరంపేట్‌లో చదరపు గజానికి రూ.30 వేలు
గండిపేట మండలం బైరాగిగూడలో 2,420 చదరపు గజాలకు చదరపు గజానికి రూ.50 వేలు, అదే మండలంలోని నార్సింగి సర్వే నంబరు 57లో 5,687 చదరపు గజాలకు చదరపు గజానికి రూ.45 వేలుగా ఖరారు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బౌరంపేట్‌లో 2,420 చదరపు గజాల భూమికి చదరపు గజానికి రూ.30 వేలు నిర్ణయించారు. అదే జిల్లాలో కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం సర్వే నంబరు 694లో 4,840 చదరపు గజాల భూమికి చదరపు గజానికి రూ.60 వేలు ధరగా పేర్కొన్నారు. పీర్జాదిగూడ సర్వే నంబరు 199లో 2,057 చదరపు గజాలతో పాటు మరో 726 చదరపు గజాల భూమికి చదరపు గజానికి రూ.40 వేల కనీస ధర నిర్ణయించారు.
వివరాలు
ఆన్‌లైన్ వేలం ప్రక్రియను జూన్ 17 నుంచి 29వరకు
గతంలో హెచ్‌ఎండీఏ నిర్వహించిన భూముల వేలంలో కొన్నిచోట్ల ధరలు అనూహ్యంగా పెరగడంతో ఆ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ భూముల సమీపంలో ఉన్న తమ భూముల విలువ పెంచుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా వేలంలో పాల్గొని కృత్రిమంగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి బిడ్ దరఖాస్తు పత్రాల రుసుమును భారీగా పెంచినట్లు అధికారులు తెలిపారు. జీఎస్‌టితో కలిపి చెల్లించిన బిడ్ డాక్యుమెంట్ ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబోమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లు జూన్ 15 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి.ఆన్‌లైన్ వేలం ప్రక్రియను జూన్ 17 నుంచి 29వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.