HMPV Virus: మహారాష్ట్రలో ఇద్దరికి హెచ్‌ఎంపీవీ వైరస్.. ఆరోగ్యశాఖ అప్రమత్తత!
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో ప్రబలుతున్న 'హ్యూమన్ మెటాన్యుమో వైరస్' (హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది.
పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు వెలుగుచూడగా, తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో 7, 14 ఏళ్ల పిల్లలకు ఈ వైరస్ నిర్ధారణ అయింది.
వారు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7 హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి.
సోమవారం, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో ఈ వైరస్ మొదటి కేసులు వెలుగు చూశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్‌పై పెద్ద ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తోంది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయంలో స్పష్టం చేస్తూ, హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదన్నారు.
Details
వైరస్ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం
దీనిని 2001లో గుర్తించారని తెలిపారు. ఇది గాలి, శ్వాసప్రక్రియ ద్వారా వ్యాపించే వైరస్ కాగా, అన్ని వయస్సుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.
ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చైనా, పొరుగు దేశాలతో పాటు దేశవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చైనాలో పలు శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలియడంతో భారత్ అప్రమత్తమైంది.
ఇటీవల, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించి, శీతాకాలం ప్రభావంగా ఈ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
భారత్‌లో సైతం ఇప్పటికే ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర వైరస్‌లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు పెరిగినంతగా వాటిని ఎదుర్కొనేందుకు దేశం సిద్దంగా ఉంది.