LOADING...
Andhra Pradesh: ఇంటికే రేషన్ డెలివరీ.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం అమలు!
ఇంటికే రేషన్ డెలివరీ.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం అమలు!

Andhra Pradesh: ఇంటికే రేషన్ డెలివరీ.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం అమలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోంది. అయితే సెలవుల కారణంగా ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో పిల్లలు పోషకాహారం కోల్పోకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 'డ్రై రేషన్' కార్యక్రమాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతూ, విద్యార్థుల ఇంటికే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ వర్తించదు. కేవలం కరువు ప్రభావిత మండలాల్లోని విద్యార్థులకు మాత్రమే అమలు చేస్తున్నారు.

వివరాలు

51 కరువు మండలాల్లో ఈ పథకం అమలు

మొత్తం 51 కరువు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తూ, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని విద్యార్థులకు రేషన్ అందిస్తున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రత్యేక కిట్ రూపంలో రేషన్ అందజేస్తారు. పిల్లలు లేదా వారి తల్లిదండ్రుల ఆధార్ ఆధారంగా ఓటీపీ వెరిఫికేషన్ చేసి రేషన్ పంపిణీ చేస్తారు. అనంతరం వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియను హెడ్‌మాస్టర్లు, ఎంఈఓలు పర్యవేక్షిస్తారు. కిట్‌లో ఒక్కో విద్యార్థికి 35 కోడిగుడ్లు, 21 చిక్కీలు అందిస్తారు.

వివరాలు

పిల్లలకు పౌష్టికాహారం దూరం కాకూడదు

అలాగే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 5 కిలోల సన్న బియ్యం, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 6 కిలోల సన్న బియ్యం ఇస్తారు. పిల్లలు వేసవి సెలవుల్లో కూడా పౌష్టికాహారానికి దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అక్రమాలు జరగకుండా కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement