AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో మాట్లాడుతూ, మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు, జాబ్ చార్టులపై సంబంధిత శాఖలతో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై సభ్యులు తమ సలహాలు, సూచనలు అందించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌరు చరితారెడ్డి, మాధవిరెడ్డి అభ్యర్థించారు. వారికి సమాధానంగా, గత ప్రభుత్వం యాక్టుల గురించి అవగాహన లేకుండా జీవోలు జారీ చేసిందని మంత్రి అనిత విమర్శించారు.
ఆరు శాఖల కలయికతో వారికి జాబ్ చార్టు
2019లో రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా నియామకం చేసినప్పుడు ఎలాంటి ట్రైనింగ్ లేదా పరీక్షలు నిర్వహించలేదని, 15 వేల మందిని రిక్రూట్ చేస్తే, అందులో 13,815 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని తెలిపారు. 2021లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చేందుకు మరొక జీవో విడుదల చేసి, సుమారు ఆరు శాఖల కలయికతో వారికి జాబ్ చార్టును ఇచ్చారని పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో.. అన్ని బాధ్యతలు వీరికి ఇచ్చారని ఇది జగన్ ప్రభుత్వం అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. పోలీస్ శాఖలో నియామకాలకు సంబంధించిన దేహధారుడ్య పరీక్షలు, రాత పరీక్షలు, సరైన ట్రైనింగ్ అవసరం ఉంటుందని, కానీ కేవలం రెండు వారాల ట్రైనింగ్‌తోనే మహిళా సంరక్షణ కార్యదర్శులను నియమించారని వ్యాఖ్యానించారు.
నియామక విధానంపై కోర్టుల్లో ఏడు పిటిషన్లు
మహిళా సంరక్షణ కార్యదర్శులకు పలు శాఖలతో సంబంధం ఉండటంతో అవి సమస్యలకు దారితీస్తున్నాయని, గత ప్రభుత్వ అవివేకంతో ఈ నియామక విధానంపై కోర్టుల్లో ఏడు పిటిషన్లు కూడా దాఖలయ్యాయని తెలిపారు. ఈ విధులపై స్పష్టత లేకపోవడంతో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీలో చెప్పారు. ఈ సందర్భంగా సభ్యులు తాము చేయగలిగిన సలహాలు, సూచనలు అందించాలని, తద్వారా శాశ్వత నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు.