
Ladakh Violence: లడఖ్ హింస వెనుక సోనమ్ వాంగ్‌చుక్.. కీలక సమాచారం సేకరించిన కేంద్రం!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఇప్పటివరకు స్థిరమైన, ప్రశాంత వాతావరణమే కొనసాగుతోంది. అయితే బుధవారం లడఖ్ ప్రాంతంలో అకస్మాత్తుగా విస్తృత స్థాయిలో హింసా ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర హోదా కోసం నిరసనకు వచ్చినవారు రోడ్లపైకి వచ్చిఅల్లకల్లోల పరిస్థితిని సృష్టించారు. వీరు భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు. ఇది మాత్రమే కాకుండా,బీజేపీ కార్యాలయం సహా ఇతర పలు కార్యాలయాలను ధ్వంసం చేసి, దాడులు చేశారు. దీంతో నేపాల్‌లో మాదిరిగా జెన్-జెడ్ తరహాలో హింస చెలరేగింది. దీంతో ఒక్కసారిగా కేంద్రం అప్రమత్తం అయింది. లడఖ్ లోకల్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం లేహ్ జిల్లాలో మొత్తం ప్రాంతానికి కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూను అమలు చేసిన తర్వాత భద్రతా దళాలు ఘర్షణను ఆపగలిగాయి,పరిస్థితిని నియంత్రించగలిగాయి.
వివరాలు
లడఖ్‌లో సోనమ్ అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమాన్నిసృష్టించాలని పిలుపు
గత రెండు వారాలుగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని నిరసన దీక్ష చేపట్టాడు. ఆయన చేస్తున్నప్రసంగాలు, వ్యాఖ్యలు కేంద్రం గమనించింది. కొన్ని సందర్భాల్లో గుంపులను హింసకు ప్రేరేపించాడని కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. సోనమ్ అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమాన్ని లడఖ్‌లో సృష్టించాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అలాగే, నేపాల్‌లో జరిగిన "జెన్-జెడ్" ఉద్యమాన్ని తరచుగా ప్రస్తావిస్తూ, ఆ ఉద్యమాన్ని పోలిన ఉద్యమానికి దారితీసే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రం గుర్తించింది. హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, సోనమ్ ఈ ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాడని పేర్కొంది.
వివరాలు
లడఖ్ ప్రాంత సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉంది
ఇక బుధవారం జరిగిన హింసలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గాయపడ్డారు. లడఖ్‌లో పరిస్థితి దానంతట అదే అదుపు తప్పలేదని, ఈ హింస ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొందరు వ్యక్తుల ప్రేరణ వల్ల ఈ సంఘటనలు జరిగాయని, సోనమ్ వాంగ్‌చుక్ వ్యక్తిగత ఆశయాలకై లడఖ్ ప్రజలు, ప్రత్యేకంగా యువత భారీ మూల్యం చెల్లిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే, ఈ కుట్రలో చిక్కిన వారిని నేరుగా నిందించలేమని కేంద్రం తెలిపింది. చివరగా, లడఖ్ ప్రజల సంక్షేమం, ప్రాంత సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.