LOADING...
Arvind Kejriwal: 'న్యాయంపై నమ్మకం పోయింది'.. ఎక్సైజ్ కేసు విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్
'న్యాయంపై నమ్మకం పోయింది'.. ఎక్సైజ్ కేసు విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్

Arvind Kejriwal: 'న్యాయంపై నమ్మకం పోయింది'.. ఎక్సైజ్ కేసు విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న విచారణకు తాను వ్యక్తిగతంగా గానీ, తన తరఫు న్యాయవాది ద్వారా గానీ హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం విచారణ నిర్వహిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆయన నేరుగా లేఖ రాశారు. తన లేఖలో,న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ నుంచి తగిన న్యాయం అందుతుందన్న విశ్వాసం తనకు లేకపోయిందని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే తాను మహాత్మా గాంధీ సూచించిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

వివరాలు 

జడ్జిని మార్చాలన్న తన అభ్యర్థనను గతంలో కోర్టు తోసిపుచ్చిందని వెల్లడి

తన అంతరాత్మకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంటూ, న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేసే హక్కును ఉన్నత న్యాయస్థానంలో వినియోగించుకుంటానని చెప్పారు. ఇదే కేసు విచారణ నుంచి న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ గతంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. విచారణలో ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరించరనే అనుమానం తనకు ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఆధారంలేని ఆరోపణలు, ఊహాగానాల ఆధారంగా న్యాయమూర్తిని మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

వివరాలు 

కేజ్రీవాల్ ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది

అలాంటి ప్రయత్నాలు న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఆమె, తన కుటుంబ సభ్యుల వృత్తిని ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలను కూడా తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకూడదని తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement