మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు: 1000మందికి పైగా దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస ఇంకా ఆగడం లేదు. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. ఓ వర్గం నిరనసకారులు గురువారం రాత్రి 1,000 మందికి పైగా కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆర్కే రంజన్ సింగ్ ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఇంతమంది కొంగ్బాలోని మంత్రి ఇంటికి చేరుకోవడం గమనార్హం. ఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో తొమ్మిది మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, ఎనిమిది మంది అదనపు గార్డులు ఉన్నారు.
మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరిన నిరసనకారులు
దాడి సమయంలో నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసిరినట్లు మంత్రి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తెలిపారు. నిరసనకారులు చాలామంది ఉన్నందున తాము వారిని నిలువరించలేకపోయామని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దాదాపు 1,200మంది కేంద్రమంత్రి ఇంటిపై దాడి చేసినట్లు ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు. మంత్రి ఇంటిపై మూకుమ్మడి దాడి జరగడం ఇది రెండోసారి. మేలో జరిగిన దాడిలో గుంపును చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగాయి.