Bengaluru: బెంగళూరులో ఇళ్ల అద్దెల దందా.. 2BHKకు రూ.30 లక్షల డిపాజిట్ డిమాండ్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు (Bengaluru)లో ఇళ్ల అద్దెలు సాధారణ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి. జీతంలో ఎక్కువ శాతం అద్దెకు వెళ్లిపోతుండటంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతోంది. తాజాగా సోషల్ మీడియా వెబ్‌సైట్ 'రెడిట్ (Reddit)'లో ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఇప్పుడు టెకీల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ నెటిజన్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ (Frazer Town)లో ఉన్న ఓ కొత్త 2BHK ఫ్లాట్ (2BHK Flat) అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమాని రూ.30 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit) కోరినట్లు పేర్కొన్నారు.
Details
సోషల్ మీడియాలో తెగ వైరల్
ఆ ఫ్లాట్‌లో డిజైనర్ ఇంటీరియర్స్, ప్రీమియం బెడ్‌లు, మాడ్యులర్ కిచెన్, పవర్ బ్యాకప్, సెక్యూరిటీ, కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. నెలకు అద్దె కేవలం రూ.20 వేలుగా నిర్ణయించినప్పటికీ, భారీ డిపాజిట్ డిమాండ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది ఒక పెద్ద స్కామ్ (Scam) అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఈ డబ్బుతోనే సొంత ఇల్లు కొంటే మంచిదంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మొత్తానికి, ఈ ఘటన బెంగళూరు అద్దె మార్కెట్‌లో జరుగుతున్న అసాధారణ పరిస్థితులను మరోసారి బయటపెట్టిందని నెటిజన్లు అంటున్నారు.