AP Tourism: ఎనిమిది చోట్ల హౌస్ బోట్లు.. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి.. త్వరలో అందుబాటులోకి
ఈ వార్తాకథనం ఏంటి
పర్యాటక రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో పర్యాటకుల కోసం హౌస్‌బోట్లు త్వరలో సేవల్లోకి రానున్నాయి. ప్రధాన నదులు, జలాశయాలపై వీటిని నిర్వహించేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడంతో, ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. గతంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో హౌస్‌బోట్లు ప్రారంభించినప్పటికీ, నిర్వహణ సమస్యల కారణంగా అనేక బోట్లు నిరుపయోగంగా మారాయి. అటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా, ఈసారి ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోనే నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది.
వివరాలు
హౌస్‌బోట్ల నిర్వహణ కోసం రూ.10కోట్ల వరకు పెట్టుబడులు
ఈ మేరకు రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లో సింగిల్,డబుల్ బెడ్‌రూమ్ సదుపాయాలతో హౌస్‌బోట్లు నడిపేందుకు అనుమతులు ఇచ్చారు. సూర్యలంక, భవానీ ద్వీపం, రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్, వైఎస్సార్ కడప జిల్లా గండికోట,అనకాపల్లి జిల్లా కొండకాకర్ల సరస్సు,విశాఖపట్నం జిల్లా గంభీరం,అల్లూరి జిల్లా తాజంగి జలాశయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఎనిమిది చోట్ల హౌస్‌బోట్ల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థలు మొత్తం రూ.10కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. విజయవాడలో కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపంలో ఇప్పటికే హౌస్‌బోట్లను సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రారంభించారు. అయితే టికెట్ బుకింగ్ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు.భవానీ ద్వీపంలో రెండు హౌస్‌బోట్లు, ఒక రొమాంటిక్ ఫ్లోట్ బోట్, మరో డైన్ బోట్‌ను సిద్ధం చేశారు.
వివరాలు
హౌస్‌బోట్ల నిర్వహణకు తాత్కాలిక అనుమతులు
ఇదే సమయంలో తాజంగి, కొండకాకర్ల సరస్సు, గంభీరం జలాశయాల్లో హౌస్‌బోట్ల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యావరణ, జలవనరుల శాఖల పరిశీలనకు పంపించారు. ఈ అనుమతులు త్వరలోనే లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్వర్ణాల చెరువు, కర్నూలు జిల్లా గార్గేయపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఎదుర్లంక ప్రాంతాల్లోనూ హౌస్‌బోట్ల నిర్వహణకు తాత్కాలిక అనుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం.
వివరాలు
ఒక్కో బోటులో ఆరుగురు వరకు బస చేసేలా సౌకర్యాలు
ఈ హౌస్‌బోట్లలో ఒక్కో బోటులో ఆరుగురు వరకు బస చేసేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాత్రి బసకు అనువుగా వీటిని నది లేదా జలాశయం ఒడ్డున ఉన్న జెట్టీల వద్ద నిలిపి ఉంచుతారు. రొమాంటిక్ ఫ్లోట్, డైన్ బోట్లలో జన్మదిన వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, చిన్నపాటి సభలు, సమావేశాలు నిర్వహించుకునే వీలుంటుంది. అదే బోటుపై లంచ్, డిన్నర్ సదుపాయాలను కూడా అందించనున్నారు. హౌస్‌బోట్ల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. జెట్టీల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వివరాలు
కంట్రోల్ రూంల్లో రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖలకు చెందిన అధికారులు విధులు
పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. హౌస్‌బోట్లు నడిచే ప్రతి ప్రాంతంలో తప్పనిసరిగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కంట్రోల్ రూంల్లో రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖలకు చెందిన అధికారులు విధులు నిర్వహిస్తారు. బోట్లలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తారు. నదులు, జలాశయాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో హౌస్‌బోట్ల సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా నిర్ణయించారు.