Kashi Vishwanath theft: అయోధ్య ఘటనతో మళ్లీ వెలుగులోకి వచ్చిన 1983 కాశీ విశ్వనాథ ఆలయ దోపిడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆలయంలో దోపిడీ అంటే కేవలం నగదు, బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు చోరీ కావడం మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కూడా దెబ్బ తగలడం. ఇటీవల అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో నాలుగు దశాబ్దాల క్రితం కాశీ విశ్వనాథ ఆలయంలో జరిగిన భారీ దోపిడీ ఘటన మరోసారి ప్రస్తావనకు వస్తోంది.
వివరాలు
1983లో కాశీ ఆలయంలో ఏం జరిగింది?
1983 జనవరిలో కాశీ విశ్వనాథ ఆలయంలో సంచలనం సృష్టించిన దోపిడీ జరిగింది. గర్భగుడిలో శివలింగం చుట్టూ అలంకరించిన సుమారు 2.6 కిలోల బంగారు ఆభరణాలు, దాదాపు 9 కిలోల వెండి చోరీకి గురయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఆలయంలో పనిచేసే కొందరి సహకారంతోనే ఈ దోపిడీ జరిగినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆలయ భద్రతా వ్యవస్థ, అంతర్గత పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
ప్రభుత్వం చేపట్టిన కీలక చర్యలు
కాశీ విశ్వనాథ ఆలయ దోపిడీ అనంతరం ఆలయ నిర్వహణ, భద్రత, ఆర్థిక వ్యవహారాలపై ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఆలయ పరిపాలనను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు ఆధీనంలోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత ఆలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, విరాళాల లెక్కింపు విధానం, ఆర్థిక నిర్వహణ, పరిపాలనా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేశారు. ఈ చర్యలతో ఆలయ నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రయత్నించారు. రామమందిర వివాదంపై సంస్కరణల డిమాండ్ అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కూడా ఇలాంటి సంస్కరణలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వివరాలు
ప్రభుత్వ నియంత్రణకు వీహెచ్‌పీ నిరాకరణ
ఇదిలా ఉండగా, రామమందిర ట్రస్టు కార్యకలాపాలకు జవాబుదారీగా ఉండే సీఈవో నియామకానికి తమకు అభ్యంతరం లేదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. అయితే శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పేర్కొంది. ఆలయ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ స్వాధీనానికి సంబంధించిన ఏ ప్రయత్నాన్నైనా తాము వ్యతిరేకిస్తామని వీహెచ్‌పీ వెల్లడించింది.