
TG News: పాశమైలారం ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్
ఈ వార్తాకథనం ఏంటి
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) స్వయంగా చర్య తీసుకుంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి నివేదికను జులై 30లోగా సమర్పించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ కమిషనర్, అగ్నిమాపక విభాగ డైరెక్టర్ జనరల్ (డీజీ), సంగారెడ్డి ఎస్పీలకు హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై న్యాయవాది, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హెచ్‌ఆర్సీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, పాత మిషనరీల వాడకమే కాకుండా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై, సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వివరాలు
కెమికల్ ఫ్యాక్టరీలలో నాణ్యత ప్రమాణాలపై సమగ్ర అధ్యయనం
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు, స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలలో నాణ్యత ప్రమాణాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించాలని హెచ్‌ఆర్సీని ఆయన కోరారు.