Andhra Pradesh : ఏపీ తీరప్రాంతంలో భారీ మార్పులు.. 31% కోత, 44% విస్తరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో తీరప్రాంతాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలోని తీరప్రాంతంలో 31 శాతం భాగం కోతకు గురికాగా, మరో 44 శాతం విస్తీర్ణం పెరిగినట్లు వెల్లడించారు. మిగిలిన 24.9 శాతం తీరప్రాంతం మాత్రం స్థిరంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. తీరప్రాంత కోతను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు.
Details
హరిత విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యం
ఈ క్రమంలో 5 కిలోమీటర్ల వెడల్పు, 1,053 కిలోమీటర్ల పొడవుతో 'గ్రేట్ గ్రీన్ వాల్' నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు తుపాన్లు, సునామీలు, సముద్రమట్టం పెరుగుదల మరియు తీరప్రాంత కోతలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మంత్రి వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రంలో హరిత విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Details
ఏడు జిల్లాలో కోత సమస్య
రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో తీరప్రాంత కోత సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని షార్ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో బింగినపల్లి, కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టా, హంసలదీవి బీచ్, పాలతుంబలపాల్యం కోనసీమ జిల్లాలో ఓడలరేవు బీచ్, కాకినాడ జిల్లాలో భైరవపాలెం, కోరింగ మడ అడవులు, హోప్ ఐల్యాండ్ పశ్చిమ భాగం, ఉప్పాడ, నేమం బీచ్, పొన్నాడ, కోనపాపపేట అలాగే విశాఖపట్నం జిల్లాలో పెడనగమయ్యపాలెం ప్రాంతాలు తీరప్రాంత కోతకు హాట్‌స్పాట్‌లుగా గుర్తించబడ్డాయని వివరించారు.