శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు దాదాపు 15 షాపులు మేర దగ్ధమయ్యాయి.
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం సన్నిధిలోని లలితాంబికా దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా మంటలు చెలరేగాయి.
మంటలు క్రమేపీ L- బ్లాకులోని మిగిలిన దుకాణాలకూ అంటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు, తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
DETAILS
దాదాపుగా రూ.2 కోట్ల మేర నష్టం
మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 14 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.
మరోవైపు మంటలు ఇతర దుకాణాలకు విస్తరించకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మరోవైపు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని, దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
భారీ అగ్ని ప్రమాదం ధాటికి దాదాపుగా రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.