బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం
విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. షోరూంతో పాటు గోదాములో ఉన్న సూమారు 300 వరకు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతికి అయినట్లు తెలుస్తోంది. విజయవాడలోని చైన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ ద్విచక్ర వాహనాల షోరూం ఉంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడం గమనార్హం. ద్విచక్ర వాహనాల షోరూంతో పాటు సర్వీస్ సెంటర్‌లను కూడా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
ఒకే ప్రాంతంలో గోడౌన్, షోరూం, సర్వీస్ సెంటర్లు కూడా ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. మొదట షోరూంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. తర్వాత గోదాముకూ మంటలు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రీ ఫ్యాబ్రిక్ పద్ధతిలో షోరూంను నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.