Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 2 లక్షల రూపాయల నాన్-రిఫండబుల్ మొత్తాన్ని చెల్లించాలి. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తెలిపినట్లు, మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య 50,000ను మించిపోయిందన్నారు. ఈ కారణంగా ప్రభుత్వానికి రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మద్యం షాపుల దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ రేపు సాయంత్రం 7 గంటల వరకు స్వీకరించనుంది.
అక్టోబర్ 11 వరకు గడువు
సిండికేట్‌ను కట్టడి చేయడం, ఎమ్మెల్యేల ప్రమేయాన్ని నివారించడం వంటి చర్యలు తీసుకోవడంతో ఈ విధానానికి సంబంధించిన దరఖాస్తులు బాగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీఎస్బీసీఎల్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు ఉందని, వినతుల ఆధారంగా, మద్యం షాపుల కోసం దరఖాస్తుల సమర్పణ గడువును పెంచామని తెలిపారు. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తులను పరిశీలించగా, 14వ తేదీన ఆయా జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీని నిర్వహించనున్నారు. ఈ రోజు కేటాయింపు ప్రక్రియను పూర్తిచేస్తారు. అక్టోబరు 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానానికి అనుగుణంగా ప్రైవేట్ మద్యం షాపులు అందుబాటులోకి రాబోతున్నాయి.