తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం
తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది. సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశాలున్నాయి. మరోవైపు 43 అడుగుల మేర ప్రవాహం ఉంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అన్నదాన సత్రం వద్దకు వరద చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపేశారు. ఈ మేరకు 24 గంటల పాటు కంట్రోల్ రూములను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. జల్లా కలెక్టర్ కార్యాలయం సహా కొత్తగూడెం,భద్రాచలం ఆర్డీవో ఆఫీసుల్లో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం,మణుగూరు, పినపాక మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సహాయ కేంద్రాలను సిద్ధం చేశారు.
వాగులు, వంకలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు : కలెక్టర్
వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు సహాయ చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. ప్రజలకు కలెక్టర్ సూచనలు : భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, వాటిని దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. మత్స్యకారులకు అలెర్ట్ : వరదల నేపథ్యంలో గంగపుత్రులు, మత్స్యకారులు చేపల వేటను వాయిదా వేయాలన్నారు. పశువులను మేతకు వదలకుండా ఇంటి వద్దే ఉంచాలన్నారు. కాళేశ్వరంలో జలకళ : రాష్ట్రంలో మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణీ సంగమం జలకళ సంతరించుకుంది. ఈ మేరకు గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.
పోలవరం వద్ద 30.680 మీటర్లుగా కొనసాగుతున్న నీటిమట్టం
కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 9.980 మీటర్ల మేర నీటి మట్టం కొనసాగుతోంది. తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రాణహిత జలకళ సంతరించుకుంది. బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తాడిచర్ల ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. కాటారం - మేడారం రహదారిలో కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న క్రమంలో రాకపోకలను నిలిపేశారు. పోలవరానికి వరద : గోదావరికి భారీ వరద ప్రారంభయ్యాక ఏలూరు జిల్లాలోని పోలవరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం వద్ద నీటిమట్టం 30.680 మీటర్లుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 3,15,791 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.
గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద
గోదావరి నదికి భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికార యంత్రానికి ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు గ్రామాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు ముంపు పెరుగుతోందని అధికారులు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఈ సందర్బంగా గండి పోచమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ వరద నీరు చేరుకుంది. ఈ క్రమంలోనే గోపురం వరకు నీరు చేరుకోవడం గమనార్హం. పరిస్థితిని సమీక్షించిన దేవాదాయశాఖ అధికారులు, అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఇదే సమయంలో ఆలయ సన్నిధిలోని స్థానికులు దుకాణాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.