LOADING...
Telangana Rising Global Summit:రెండో రోజు రూ.1,77,500 కోట్లకు ఎంవోయూలు.. సమిట్‌లో వెల్లువెత్తిన పెట్టుబడులు
రెండో రోజు రూ.1,77,500 కోట్లకు ఎంవోయూలు.. సమిట్‌లో వెల్లువెత్తిన పెట్టుబడులు

Telangana Rising Global Summit:రెండో రోజు రూ.1,77,500 కోట్లకు ఎంవోయూలు.. సమిట్‌లో వెల్లువెత్తిన పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ అంతర్జాతీయ సదస్సులో మొత్తంగా రూ.5,75,000 కోట్ల పెట్టుబడులకు చెందిన ఎంవోయూలు కుదిరాయి. తొలి రోజునే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగగా,మంగళవారం రెండోరోజు మరికొన్ని ప్రముఖ సంస్థలతో మరో రూ.1,77,500 కోట్లకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు ప్రకటించిన సంస్థలలో ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్‌ ముందంజలో నిలిచింది. రూ.70 వేల కోట్లతో 150ఎకరాల్లో ఒక గిగావాట్‌ సామర్థ్యం కలిగిన ఏఐ రెడీ డేటా పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే జేసీకే ఇన్‌ఫ్రా సంస్థ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్‌ మౌలిక వసతుల విస్తరణపై ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

వివరాలు 

పర్యాటక రంగంలో రూ.7,045 కోట్లు 

దీని ద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పర్యాటక రంగంలోనూ మంగళవారం భారీ ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. మొత్తం రూ.7,045 కోట్ల మేర పెట్టుబడులపై ఒప్పందాలు జరగడంతో ప్రత్యక్షంగా దాదాపు 10 వేల మందికి, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఐటీ, విద్యుత్‌, క్రీడలు, టూరిజం, అటవీ రంగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ పెట్టుబడులపై పరిశ్రమలు ఆసక్తి చూపాయి. 2047 కల్లా తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలచాలన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

వివరాలు 

హైదరాబాద్‌లో జీసీసీ ప్రారంభ ప్రణాళిక

సదస్సు ప్రాంగణంలో మంగళవారం పలువురు అంతర్జాతీయ, దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. తాజ్‌ జీవీకే ఎండీ శాలిని భూపాల్‌, అనలాగ్‌ ఏఐ ప్రతినిధులు, డ్రీమ్‌ వాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌, సెంబ్‌కార్ప్‌ (సింగపూర్‌),టీసీసీఐ (తైవాన్‌),ఐఐఎఫ్‌ఏ,అట్మాస్పియర్‌ కోర్‌ ఇండియా,శ్రీ హవీషా హాస్పిటాలిటీ,సారస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,పోలిన్‌ గ్రూప్‌, మల్టీవర్స్‌,కారవాన్‌, కేఈఐ గ్రూప్‌, క్రిస్టల్‌ లగూన్స్‌ (అమెరికా), గ్రీన్‌ పాంథర్స్‌ ప్రాపర్టీస్‌ ప్రతినిధులు, గోద్రెజ్‌ జెర్సీ గ్రూప్‌ ఈవీపీ పిరోజ్‌షా గోద్రెజ్‌, గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ స్వామి తదితరులు సీఎం‌తో భేటీ అయ్యారు. పాడి పరిశ్రమ,ఎఫ్‌ఎంసీజీ, రియల్‌ ఎస్టేట్‌, ఆయిల్‌పామ్‌ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తపరిచారు. ఇదే సందర్భంగా కెనడియన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు హైదరాబాద్‌లో జీసీసీ ప్రారంభ ప్రణాళికలను వెల్లడించారు.

Advertisement

వివరాలు 

గ్రీన్‌ ఫార్మాసిటీలో రూ.3,500 కోట్లతో సీడీఎంవో యూనిట్

ఎంవోయూల వివరాలిలా ఉన్నాయి. ఏజీపీ గ్రూప్‌ రాష్ట్రంలో 125 ఎకరాల్లో గిగావాట్‌ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ క్యాంపస్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థను నెలకొల్పుతూ రూ.6,750 కోట్ల పెట్టుబడి పెడుతుంది. బయాలాజికల్‌ ఈ లిమిటెడ్‌ గ్రీన్‌ ఫార్మాసిటీలో రూ.3,500 కోట్లతో సీడీఎంవో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించగా 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఫుడ్‌లింక్‌ ఎఫ్‌ అండ్‌ బి హోల్డింగ్స్‌ ఇండియా రూ.3,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా మూడు దశల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులతో 1,600 ఉద్యోగాలు కల్పిస్తుంది. ఫెర్టిస్‌ ఇండియా రూ.2,000 కోట్లతో అత్యాధునిక ఆహార-వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పి, అల్యూలోజ్‌, గ్లైసిన్‌ ఆధారిత పదార్థాలు తయారు చేస్తుంది.

Advertisement

వివరాలు 

హెటిరో గ్రూప్‌ రూ.1,800 కోట్లతో 100 ఎకరాల్లో ఫార్మా యూనిట్లు

ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించగా, 800 ఉద్యోగాలు కల్పించనున్నారు. అరబిందో ఫార్మా రూ.2,000 కోట్లతో జనరిక్‌ ఔషధాలు, ఇంజెక్టబుల్స్‌, బయోసిమిలర్లు తయారు చేసి 3,000 మందికి ఉపాధి కల్పించనుంది. హెటిరో గ్రూప్‌ రూ.1,800 కోట్లతో 100 ఎకరాల్లో ఫార్మా యూనిట్లు నెలకొల్పి 9,000 ఉద్యోగాలు ఇవ్వనుంది. రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ రూ.1,500 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్‌ నెలకొల్పి 1,000 ఉద్యోగాలు కల్పిస్తుంది. గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.1,200 కోట్లతో క్యాన్సర్‌ ఔషధాల సీడీఎంవో ఏర్పాటు చేస్తూ 3,000 ఉద్యోగాలకు అవకాశం కల్పించనుంది. విన్టేజ్‌ కాఫీ అండ్‌ బెవరేజ్‌ రూ.1,100 కోట్లతో ఫ్రీజ్‌ డ్రైడ్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ యూనిట్‌ నెలకొల్పి 1,000 మంది ఉపాధి ఇస్తుంది.

వివరాలు 

కేన్స్‌ టెక్నాలజీ ఈఎంఎస్‌ విస్తరణకు రూ.1,000 కోట్లు 

టీడబ్ల్యూఐ గ్రూప్‌, డ్రీమ్‌వాలీ గోల్ఫ్‌, సారస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చెరో రూ.1,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించగా,భారత్‌ బయోటెక్‌ రూ.1,000 కోట్లతో సీఆర్‌డీఎంవో ఏర్పాటు చేసి 200 ఉద్యోగాలు కల్పించనుంది. కేన్స్‌ టెక్నాలజీ ఈఎంఎస్‌ విస్తరణకు రూ.1,000 కోట్లు వెచ్చించనుంది. అట్మాస్పియర్‌ కోర్‌ హోటల్స్‌ రూ.800 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. కేజేఎస్‌ ఇండియా రూ.650 కోట్లతో ఆహార పానీయాల యూనిట్‌ నెలకొల్పి 1,551 ఉద్యోగాలు ఇస్తుంది. ఐఐఎఫ్‌ఏ పార్ట్‌నర్‌షిప్‌ ప్రాజెక్టు రూ.550-600 కోట్లది. మహీంద్రా అండ్‌ మహీంద్రా రూ.500 కోట్లతో జహీరాబాద్‌ యూనిట్‌ను విస్తరిచి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లు తయారు చేస్తుంది. పోలిన్‌ గ్రూప్‌, ఫ్లూయిడ్రా ఇండియా, శ్రీ హవిషా హాస్పిటాలిటీ చెరో రూ.300 కోట్లు పెట్టుబడి పెడతాయి. కేఈఐ గ్రూప్‌ రూ.200 కోట్లు వెచ్చిస్తుంది.

వివరాలు 

గోద్రెజ్‌ గ్రూప్‌ రూ.150 కోట్లతో డెయిరీ విస్తరణ

బయోవరం సంస్థ రూ.250 కోట్లతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను నెలకొల్పి ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 500 ఉద్యోగాలు ఇస్తుంది. గోద్రెజ్‌ గ్రూప్‌ రూ.150 కోట్లతో డెయిరీ విస్తరణ చేపట్టి 300 ఉద్యోగాలు కల్పించనుంది. రిథిరా గ్రూప్‌ రూ.120 కోట్లు, సలామ్‌ నమస్తే దోశ హట్‌-వైజాగ్‌ రిక్రియేషన్‌ రూ.25 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి. అక్విలాన్‌ నెక్సస్‌ సంస్థ 50 మెగావాట్ల డేటాసెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా, పర్వ్యూ గ్రూప్‌ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత హైపర్‌స్కేల్‌ డేటాసెంటర్‌ క్యాంపస్‌ను నెలకొల్పి 3,000 ఉద్యోగాలు అందించనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించింది. జ్యూరిక్‌ ఇన్సూరెన్స్‌ హైదరాబాద్‌లో తొలి జీసీసీని ప్రారంభించగా, కెనడియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, మ్యాగ్జిమస్‌ సంస్థలు గ్లోబల్‌ హబ్‌ల ఏర్పాటు చేస్తాయి.

వివరాలు 

సుమధుర, సత్వ, బ్రిగేడ్‌ గ్రూపులు టౌన్‌షిప్‌ ప్రాజెక్టులపై చర్చలు

అనలాగ్‌ ఏఐ ప్రపంచ స్థాయి పరిశోధన ల్యాబ్‌ నెలకొల్పనుంది. సుమధుర, సత్వ, బ్రిగేడ్‌ గ్రూపులు టౌన్‌షిప్‌ ప్రాజెక్టులపై చర్చలు జరిపాయి. బ్లాక్‌స్టోన్‌ ఏషియా డేటా సెంటర్లు, లాజిస్టిక్‌ పార్కులు, కమర్షియల్‌ స్పేస్‌లపై పెట్టుబడులకు ముందుకొచ్చింది. టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఎంవోయూ కుదిరింది. యూఏఈ రాజకుటుంబ ప్రతినిధి షేక్‌ అల్‌ తారిఖ్‌ ఖాసిమి సహా పలు దేశాల పారిశ్రామిక ప్రతినిధులను సీఎం కలుసుకుని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, టూరిజం జోన్లు, లాజిస్టిక్‌ హబ్‌లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టులపై వివరించారు. ఈ రంగాల్లో పెట్టుబడుల కోసం ఎంవోయూలకు ఆహ్వానించారు.

వివరాలు 

సూపర్‌క్రాస్‌ ఇండియా సంస్థ రూ.75 కోట్లతో మోటార్‌ రేసింగ్‌ ప్రాజెక్టు

క్రీడారంగంలోనూ భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ రూ.1,000 కోట్లతో శాటిలైట్‌ స్పోర్ట్స్‌ సిటీ నిర్మించనుంది. డ్రీమ్‌ వ్యాలీ రూ.1,000 కోట్లతో గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రాజెక్టు చేపట్టనుంది. ఇండియా ఎక్స్‌ట్రీమ్‌ అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ సంస్థ రూ.500 కోట్లతో 20 ఎకరాల్లో అడ్వెంచర్‌, ఈ-స్పోర్ట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎరీనాను ఏర్పాటు చేస్తుంది. సూపర్‌క్రాస్‌ ఇండియా సంస్థ రూ.75 కోట్లతో మోటార్‌ రేసింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఫిఫా-ఏఐఎఫ్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దేశంలో తొలి, ప్రపంచంలో రెండో మహిళల ఫుట్‌బాల్‌ అకాడమీ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. 2026 మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్లు గచ్చిబౌలిలో నిర్వహించనున్నారు. అలాగే ఆసియా రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌, హైదరాబాద్‌ అంతర్జాతీయ చెస్‌ ఫెస్టివల్‌లకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.

Advertisement