
Human Rights Forum: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక ఆగ్రహం.. న్యాయ విచారణ చేయాలని డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్‌పై పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల వేదిక తెలంగాణ కీలక ప్రకటన చేసింది. వేదిక విడుదల చేసిన ప్రకటనలో ఈ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా తీసుకుని విచారణ జరిపి, చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పక పడేలా చూడాలని హైకోర్టు, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నామని పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత స్వతంత్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి, వారిపై హత్య నేరం నమోదు చేయాలన్నారు.రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని పేర్కొన్నారు.
Details
ఘటనా స్థలంలోనే మరణించిన రియాజ్
ఇక ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు. రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడని తెలిపారు. చెకింగ్‌లో భాగంగా ఆర్‌ఐ గది వద్దకు వెళ్లగానే శబ్దం వినిపించడంతో లోపలికి వెళ్లారని చెప్పారు. ఈ సమయంలో రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని, పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణలో భాగంగా ఆర్‌ఐకి గత్యంతరం లేక కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ వివరించారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.