డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో రూపుదిద్దుకుంది. హుస్సేన్ సాగర్ పక్కన, ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని 125అడుగుల ఎత్తులో డాక్తర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఆవిష్కరణ కోసం ఆల్రెడీ 10కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. విగ్రహం వివరాలు: హుస్సేన్ సాగర్ పక్కన 11ఎకరాల స్థలంలో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనంలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 125అడుగుల ఎత్తున్న విగ్రహం, 50అడుగుల పీఠం మీద నిలబడి ఉంది. ఈ పీఠం భారతదేశ పార్లెమెంటు నిర్మాణాన్ని పోలి ఉంటుంది.
125వ పుట్టినరోజున ప్రకటించిన ప్రభుత్వం
సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ పీఠాన్ని నిర్మించారు. ఈ విగ్రహానికి ఇప్పటివరకు అయిన ఖర్చు 83.69కోట్లు. పూర్తి ఒప్పందం విలువ 104.18కోట్లు. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహ డిజైన్ ని రామ్ వి సుతార్ రూపొందించారు. అంబేద్కర్ 125వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. విగ్రహ ఆవిష్కరణకు విచ్చేస్తున్న అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసారు. 20మంది బౌద్ధ గురువుల సమక్షంలో సీఎం కేసీఆర్, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూలజల్లులు కురిపిస్తారు.