హైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు
గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 36క్రేన్లు, హైదరాబాద్‌లో మొత్తం 100చోట్ల నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు 200మంది గజ ఈతగాళ్లను కొలనుల వద్ద ఉంచనున్నారు. పోలీస్ బందోబస్తు కోసం మొత్తం 40వేల మందిని నియమించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 25వేల మంది, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 13వేల మంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఆర్ఏఎఫ్, పారా మిలటరీ బలగాలు కూడా బందోబస్తులో పాల్గొనున్నాయి. కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జనాన్ని సీపీ ఆనంద్ ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. బందోబస్తులో భాగంగా 3600సీసీ కెమెరాలను అమర్చారు.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, మద్యం షాపులు బంద్
గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా టీఎస్‌ఆర్‌టీసీ వివిధ మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నడపనుంది. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి డిపో నుంచీ 15 -20 బస్సులను నడపనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. అలాగే నిమజ్జనం నేపథ్యంలో భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైలు తన పని వేళలను గురువారం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు.