Loading...
Hyderabad: గ్లోబల్‌ కాన్ఫిడెన్స్‌ సెంటర్‌గా హైదరాబాద్‌.. సరికొత్త లక్ష్యంతో ప్రభుత్వం!
గ్లోబల్‌ కాన్ఫిడెన్స్‌ సెంటర్‌గా హైదరాబాద్‌.. సరికొత్త లక్ష్యంతో ప్రభుత్వం!

Hyderabad: గ్లోబల్‌ కాన్ఫిడెన్స్‌ సెంటర్‌గా హైదరాబాద్‌.. సరికొత్త లక్ష్యంతో ప్రభుత్వం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ను గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) గమ్యస్థానంగానే కాకుండా.. ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే 'గ్లోబల్‌ కాన్ఫిడెన్స్‌ సెంటర్‌'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రపంచ మార్కెట్‌ అవసరాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తులో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించే సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ దిగ్గజ సంస్థ 'బ్యాక్‌బేస్‌' డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు.

వివరాలు

ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే టెక్నాలజీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ కంపెనీలకు ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి కంపెనీల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో అధునాతన డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

వివరాలు

బ్యాక్‌బేస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కీలక పాత్ర

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తరువాతి తరం డిజిటల్‌ బ్యాంకింగ్‌ పరిష్కారాలు (నెక్స్ట్‌ జనరేషన్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌), సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను అందించడంలో బ్యాక్‌బేస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వెల్లడించారు.

ఇలాంటి అంతర్జాతీయ సంస్థల రాకతో హైదరాబాద్‌ టెక్నాలజీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకోనుందని పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నెదర్లాండ్స్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ యాన్‌ క్రెమర్స్‌, బ్యాక్‌బేస్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ) గ్రెగ్‌ ఫాహి, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రీన్‌హార్డ్‌ షీల్‌, ఇండియా సైట్‌ హెడ్‌ సురభి శర్మ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT