
Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు ఎన్‌టీఆర్ స్టేడియంలో జరుగుతుంది.
37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా. యాకూబ్ షేక్ వెల్లడించారు.
ఈసారి సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శిస్తారని తెలిపారు.
బుధవారం ఎన్‌టీఆర్ స్టేడియంలో జరిగిన హెచ్‌బీఎఫ్ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు డా. యాకూబ్ షేక్, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్, కోశాధికారి పి. నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, తెలంగాణ భాషా,సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు
తొలిసారిగా రెండు వేర్వేరు స్టేజీలు
పుస్తకప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఈవెంట్ 11రోజుల పాటు జరగనుంది.
సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బుక్ ఫెయిర్‌ను సందర్శించవచ్చు.
ఈ సంవత్సరం తొలిసారిగా రెండు వేర్వేరు స్టేజీలు ఏర్పాటు చేశారు.
ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల పేరును,సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి బోయి విజయ భారతి పేరును,పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్ పేరును నిర్దేశించారు.
బుక్ ఫెయిర్ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక వంటకాల ఫుడ్ స్టాళ్లతో పాటు పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు,సాంస్కృతిక ప్రదర్శనలు,వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నారు.
పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపును అందిస్తున్నామని,మరిన్ని ఆఫర్లు కూడా ఉండబోతున్నాయని బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు.