Loading...
Food Safety Raid: హైదరాబాద్‌లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. పుల్లారెడ్డి లైసెన్స్ సస్పెండ్!
పుల్లారెడ్డి లైసెన్స్ సస్పెండ్!

Food Safety Raid: హైదరాబాద్‌లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. పుల్లారెడ్డి లైసెన్స్ సస్పెండ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని స్వీట్‌ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలో పేరొందిన జి. పుల్లారెడ్డి స్వీట్స్‌తో పాటు నిబంధనలు ఉల్లంఘించిన పలు సంస్థలపై చర్యలు తీసుకున్నారు. పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన తయారీ కేంద్రం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్), పోలీసు శాఖకు చెందిన సిబ్బందితో కలిపి మొత్తం 13 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 16 ప్రధాన స్వీట్‌ షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి.

వివరాలు 

సనత్‌నగర్ యూనిట్‌లో 3,133 కిలోల ఆహార పదార్థాలు సీజ్

ఈ దాడుల్లో రూ.16.86 లక్షల విలువైన 3,546 కిలోల కల్తీ, పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న మరో ఐదు దుకాణాలను మూసివేశారు.

సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు లోపాలను గుర్తించారు.

అక్కడ కుళ్లిపోయిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు కనిపించాయి.

వంటగది, శుభ్రపరిచే ప్రాంతాల్లోనూ అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ తయారీ కేంద్రానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.

ఈ కేంద్రం నుంచే రూ.15.03 లక్షల విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

నగరవ్యాప్తంగా స్వీట్ షాపులపై దాడులు, పలు సంస్థలపై వేటు

ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు చర్యలు చేపట్టారు.

చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌లోని హిరాణి ఫుడ్స్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు.

అలాగే, సరైన లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో దుకాణాలు నిర్వహిస్తున్న చాంపాపేట్‌లోని బాలాజీ స్వీట్స్, సికింద్రాబాద్‌లోని మమతా స్వీట్ హౌస్‌తో పాటు మరో మూడు దుకాణాలను మూసివేయించారు.

తనిఖీల్లో భాగంగా మొత్తం 22 ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.

ల్యాబ్ నివేదికలు అందిన తర్వాత వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ADVERTISEMENT