హైదరాబాద్‌లో సంచలనం సృష్డించిన గణేష్ లడ్డూ ధర.. బండ్లగూడలో రూ. 1.26 కోట్లు పలికిన ప్రసాదం
హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ కనివినీ ఎరుగని రీతిలో రికార్డ్ ధర పలికింది. ఈ మేరకు రూ. 1.26 కోట్లకు లడ్డూ వేలం పలికింది. రాజేంద్రనగర్ బండ్లగూడలోని రిచ్‌మండ్ విల్లాలోని వినాయకుడి వేలంలో ఈ సంచలనం నమోదైంది. అయితే వేలంలో పాల్గొన్న వారంతా మహిళలే కావడం విశేషం. విల్లాస్‌లో ఉండే ఐదుగురు మహిళలు ఓ బృందంగా ఏర్పడి రూ. 1.26 కోట్లకు లడ్డూను వేలం పాడారు. మరోవైపు మాదాపూర్ మై హోమ్ భూజాలోని లడ్డూ సైతం భారీ ధర పలికింది. దాదాపుగా రూ. 25.50 లక్షలకు ఎదులకంటి చిరంజీవి గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది లడ్డూ రూ. 18.50 లక్షలు పలకగా, ఈసారి రూ. 25.50 లక్షలు పలికింది.
నల్లగొండ పట్టణంలో రూ. 36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ ప్రసాదం
నల్లగొండ పట్టణంలోనూ లడ్డూ భారీ ధర పలికింది. పాతబస్తీలో హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను పెరిక కిరణ్ జయరాజు రూ. 36 లక్షలకు వేలం పాడారు. గతేడాది కేవలం రూ.11 లక్షలే పలికిన లడ్డూ, ఈసారి రూ. 36 లక్షలు పలికి చరిత్ర లిఖించింది. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, దళిత నేతగా పెరిక కిరణ్ జయరాజు గుర్తింపు పొందారు. మరోవైపు బాలాపూర్ గణేశుడి లడ్డూ సైతం భారీ రేట్ పలికింది. ఈసారి లడ్డూ వేలం రూ. 27 లక్షలు పలికింది. ఈ మేరకు బాలాపూర్ ఉత్సవ కమిటీ ముందుగానే అంచనా వేసింది. గతేడాది రూ.24.60 లక్షలకు లక్ష్మారెడ్డి దక్కించుకోగా, ఈసారి దాసరి దయానంద రెడ్డి రూ. 27లక్షలకు పాడారు.