Balapur Laddu Auction : రికార్డు ధర పలికిన బలాపూర్ లడ్డూ.. ఈసారీ ఎంతంటే?
బాలాపూర్ లడ్డూకు దేశ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ ఏడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం ప్రారంభించింది. ఈ వేలం పాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హజరయ్యారు. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దయానందరెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది వేలంలో రూ.24.60 లక్షలు పలకగా, ఈసారి అంతకంటే ఎక్కువ ధర పలికింది. లడ్డూ వేలం పూర్తికాగానే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది.
బాలాపూర్ లడ్డూకు 30 ఏళ్లు
ఇక బాలాపూర్ లడ్డూ వేలాన్ని ప్రారంభించి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి అయింది. మొదటిసారిగా 1994లో బాలాపూర్ లడ్డు వేలం వేయగా స్థానిక రైతు కొలను మోహన్ రెడ్డి రూ.450 కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ లడ్డూను 28 సార్లు వేలం వేశారు. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం లడ్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. లడ్డూ ద్వారా వచ్చిన డబ్బుతో ఉత్సవ కమిటీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఒకప్పుడు సాదారణ పల్లెటూరిగా ఉండే బాలాపూర్ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్లుతోంది.