ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు, యువతలో దేశభక్తిని నింపేందుకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నట్లు చెప్పింది. 'ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13నెలల వరకు హైదరాబాద్‌కు రాలేదు. అప్పటి వరకు హైదరాబాద్ నిజాం పాలనలోనే మగ్గింది. 1948సెప్టెంబర్ 17న "ఆపరేషన్ పోలో" అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది ' అని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా
గతేడాది సెప్టెంబర్ 17న 'ముక్తి దివస్'గా పిలువబడే హైదరాబాద్ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని నిజాం సైన్యం, రజాకార్లకు (నిజాం పాలనకు సాయుధ మద్దతుదారులు) వ్యతిరేకంగా పోరాడిన వీర జవాన్లకు నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్ కార్యక్రమంలో హోంమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో షా ప్రసంగిస్తూ.. దేశంలోని గత ప్రభుత్వాలను ఎండగడుతూ, మభ్యపెట్టే విధానాల వల్ల ఏ ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి వెనుకాడుతున్నాయన్నారు. 1948లో హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.