Hyderabad metro 2nd phase: నాలుగేళ్లలో మెట్రో రెండోదశ.. కేంద్రం ఆమోదానికి డీపీఆర్..
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతం కావడంతో, రెండో దశను మరింత విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు పీపీపీ విధానంలో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును రూ. 24,269 కోట్ల అంచనాతో ఐదు కారిడార్లలో 76.4 కి.మీ. విస్తరించడానికి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు శనివారం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం లభించిన వెంటనే పనులు మొదలుపెట్టి, నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ మెట్రో విస్తరణ ద్వారా 8 లక్షల మందికి ప్రయాణ సౌలభ్యం కలగనుంది.
జైకా, ఏడీబీ వంటి సంస్థల నుంచి రుణం..
రెండోదశలో మొత్తం 116.4 కి.మీ. మేర ఆరు కారిడార్లను గుర్తించారు. ఈలోగా, 76.4 కి.మీ. మేర ఐదు కారిడార్ల డీపీఆర్ పూర్తయి మంత్రి మండలి ఆమోదం పొందింది. మిగిలిన 40 కి.మీ. మార్గం శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్‌సిటీ వరకు పొడవుండగా, ఈ మార్గంపై క్షేత్రస్థాయి అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రతిపాదిత ఖర్చు రూ. 7,313 కోట్లలో 30 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దాదాపు 18శాతం వ్యయం రూ. 4,230 కోట్లను కేంద్రం భరించనుంది. మిగతా 48 శాతం వ్యయం జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల రుణాలతో, కేంద్రం పూచీకత్తుతో సమకూర్చుకోనున్నారు. ప్రాజెక్టు ఖర్చులో 4 శాతం రూ. 1,033 కోట్లు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.