LOADING...
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్‌ ఒప్పందం
రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్‌ ఒప్పందం

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్‌ ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది. మెట్రోకు సంబంధించిన రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్‌ చేయడానికి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ)తో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై దిల్లీలో అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్‌కుమార్‌ దూబె, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ రుణ సౌకర్యాన్ని 20 ఏళ్ల కాలపరిమితితో అందించనుండగా, త్రైమాసిక చెల్లింపుల విధానంలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేశారు. ఈ ఒప్పందంతో మెట్రో ప్రాజెక్టు ఆర్థిక నిర్వహణ మరింత సులభం కానుందని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

నగర ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది 

ఈ సందర్భంగా సీఎస్‌ రామకృష్ణారావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మెట్రోలో వంద శాతం యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి బదిలీ అయినట్లు తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్‌ కీలక కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. మెట్రో సేవలను మరింత విస్తరించడం ద్వారా ట్రాఫిక్‌ రద్దీ తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రుణాల రీఫైనాన్స్‌ ప్రక్రియలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement