Road accidents: రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం.. ఎక్కువ యాక్సిడెంట్లు ఈ టైమ్‌లోనే!
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 'Accidental Deaths and Suicides in India 2024' నివేదిక ప్రకారం.. 2024లో హైదరాబాద్ నగరంలో మొత్తం 3,785 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే నగరాల జాబితాలో ఢిల్లీ (5,573), బెంగళూరు (4,769) తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 2023లో హైదరాబాద్‌లో నమోదైన 2,943 ప్రమాదాలతో పోలిస్తే.. 2024లో ప్రమాదాల సంఖ్య 28.6 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నగరంలో జరిగిన ప్రమాదాల కారణంగా 301 మంది మృతి చెందగా.. 3,393 మంది గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన మరణాలు, గాయాల్లో ద్విచక్ర వాహనాల పాత్రే అత్యధికంగా ఉంది.
వివరాలు
బైక్ ప్రమాదాల కారణంగా ఎక్కువ మరణాలు
బైక్ ప్రమాదాల కారణంగా 161 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,072 మంది గాయపడ్డారు. ఆటోరిక్షాలు, మూడు చక్రాల వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 10 మంది మరణించగా.. 238 మంది గాయపడ్డారు. అలాగే కార్లు, జీపులు, ఎస్‌యూవీలతో జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. 125 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల ప్రభావం పాదచారులపై కూడా తీవ్రంగానే ఉంది. 2024లో హైదరాబాద్ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 117 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోగా.. 907 మంది గాయపడ్డారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. నగరంలో అత్యధిక ప్రమాదాలు రద్దీ సమయాల్లోనే నమోదయ్యాయి.
వివరాలు
సాయంత్రం సమయాల్లో ఎక్కువ ప్రమాదాలు
ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 593 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య 559 ప్రమాదాలు, సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య 553 ప్రమాదాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2024లో మొత్తం 25,986 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. 2023లో నమోదైన 22,903 కేసులతో పోలిస్తే.. ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య 13.5 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఈ ప్రమాదాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 7,949 మంది మృతి చెందగా.. 23,658 మంది గాయపడ్డారు.
వివరాలు
తమిళనాడులో అత్యధిక రోడ్డు ప్రమాదాలు
దేశవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో నమోదయ్యాయి. అక్కడ మొత్తం 67,296 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (55,771), కేరళ (46,591), కర్ణాటక (43,062), ఉత్తరప్రదేశ్ (38,417), మహారాష్ట్ర (36,051) నిలిచాయి. తెలంగాణలో జరిగిన మరణాలు, గాయాల్లో కూడా ద్విచక్ర వాహనాల వాటానే ఎక్కువగా ఉంది. బైక్ ప్రమాదాల్లో 4,216 మంది మరణించగా.. 12,425 మంది గాయపడ్డారు. కార్లు, జీపులు, ఎస్‌యూవీల కారణంగా 651 మరణాలు, 2,907 గాయాలు నమోదయ్యాయి. అలాగే ట్రక్కులు, మినీ ట్రక్కులు, లారీల వంటి భారీ వాహనాల వల్ల 385 మంది మరణించగా.. 1,199 మంది గాయపడ్డారు. ఆటోరిక్షాల కారణంగా 336 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,866 మంది గాయపడ్డారు.
వివరాలు
బస్సు ప్రమాదాల్లో 109 మంది మృతి
బస్సు ప్రమాదాల్లో 109 మంది మరణించగా.. 601 మంది గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పాదచారుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,586 మంది పాదచారులు మృతి చెందగా.. 3,767 మంది గాయపడ్డారు. తెలంగాణలో కూడా అత్యధిక ప్రమాదాలు సాయంత్రం రద్దీ సమయంలోనే నమోదయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 5,428 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య 4,856 ప్రమాదాలు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య 3,948 ప్రమాదాలు నమోదయ్యాయి. అత్యల్ప ప్రమాదాలు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య నమోదయ్యాయి.
వివరాలు
అత్యధిక ప్రమాదాలు రాష్ట్ర రహదారులపైనే
ఈ సమయంలో కేవలం 1,246 ప్రమాదాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. తెలంగాణలో అత్యధిక ప్రమాదాలు రాష్ట్ర రహదారులపైనే జరిగినట్లు నివేదిక తెలిపింది. రాష్ట్ర రహదారులపై 15,359 ప్రమాదాలు నమోదవగా.. వాటిలో 4,197 మంది మృతి చెందారు. 13,967 మంది గాయపడ్డారు. జాతీయ రహదారులపై 8,594 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 3,065 మంది ప్రాణాలు కోల్పోగా.. 7,873 మంది గాయపడ్డారు. రాష్ట్ర హైవేలపై 2,028 ప్రమాదాలు జరిగి.. 686 మంది మరణించగా.. 1,815 మంది గాయపడ్డారు. ఇక ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ ఏడాది కేవలం ఐదు ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. వాటిలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు.