Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో కొత్త యుగం ఆరంభం:రేవంత్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకూ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, భద్రతాపరమైన స్థిరత్వం హైదరాబాద్ ప్రత్యేకతగా నిలుస్తుందని అన్నారు. యువ జనాభా అధికంగా ఉండి, వేగవంతమైన అభివృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (US-India Strategic Partnership Forum)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత మూడు దశాబ్దాలుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా, పెట్టుబడులు, పెట్టుబడిదారుల పట్ల అందరూ సానుకూల దృక్పథంతో వ్యవహరించారని గుర్తుచేశారు.
వివరాలు
అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం
హైదరాబాద్‌ను భారతదేశంలో పెట్టుబడులకు ప్రధాన ద్వారంగా పేర్కొన్న ఆయన, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCCs)కు కేంద్రంగా నిలుస్తున్నహైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్యాభివృద్ధి,పట్టణాభివృద్ధి,ఆధునిక వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రథమ లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. గత 23 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు. ఆధునిక మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో నిర్మితమవుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ' దేశంలోనే అత్యాధునిక నగరంగా ఎదుగుతోందని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ పూర్తి అయితే,లండన్,టోక్యో, దుబాయ్,సియోల్ రివర్‌ఫ్రంట్‌ల తరహాలో హైదరాబాద్ రాత్రి ఆర్థిక వ్యవస్థ (Night Economy)లో కొత్త దశను ప్రారంభిస్తుందని అన్నారు.
వివరాలు
"ట్రెండ్‌ను మార్చబోతున్నాం" - సీఎం రేవంత్
డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (RRR), రేడియల్ రోడ్లు, అలాగే ORR-RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక మౌలిక ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు. "చైనా ప్లస్ వన్" వ్యూహానికి గ్లోబల్ స్థాయిలో ప్రత్యామ్నాయం తెలంగాణ అవుతుందని ఆయన ధృవీకరించారు. భారతదేశంలో రోడ్లకు సాధారణంగా నేతల పేర్లు పెట్టే సంప్రదాయం ఉండగా, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రముఖ కంపెనీలైన గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లను ప్రధాన రహదారులకు ఇవ్వాలన్న ఆలోచన ఉందని తెలిపారు.
వివరాలు
తెలంగాణ రైజింగ్ 2047 విజన్
సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తెలంగాణ విజన్ స్పష్టమైనది, సాహసోపేతమైనది, సాధ్యమైనదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, భవిష్యత్ ప్రాజెక్టులు మరియు వాటి సామాజిక ప్రభావం అత్యంత ప్రేరణాత్మకమని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు USISPF సభ్యులలో చాలా మంది డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు"లో పాల్గొనబోతున్నారని, తెలంగాణ విజన్‌ను దగ్గరగా అవగాహన చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని USISPF అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆఘీ తెలిపారు.