Loading...
Telangana : హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్
గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్

Telangana : హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి భూమిని కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

వివరాలు 

గాజులరామారంలో, హెచ్‌ఎంటీ భూములకు సమీపంలోనే 100 ఎకరాల స్థలం 

జగద్గిరిగుట్ట సమీపంలో బస్ డిపో నిర్మాణం కోసం టీజీఎస్‌ఆర్టీసీ గతంలో హెచ్‌ఎంటీకి చెందిన భూమిని 99 సంవత్సరాల లీజుకు ఇవ్వాలని కోరిందని తెలిపారు.

అయితే, హెచ్‌ఎంటీ అధికారులు గరిష్ఠంగా 20 ఏళ్లపాటు మాత్రమే లీజు ఇవ్వగలమని, అదీ ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారని చెప్పారు.

అంతేకాకుండా, ఆ భూమి వినియోగానికి ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలనే షరతు విధించడంతో ఆ ప్రతిపాదనను టీజీఎస్‌ఆర్టీసీ అంగీకరించలేదని గడ్కరీ వివరించారు.

దీంతో ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో, హెచ్‌ఎంటీ భూములకు సమీపంలోనే 100 ఎకరాల స్థలాన్ని టీజీఎస్‌ఆర్టీసీకి కేటాయించినట్లు ఆయన తెలిపారు.

వివరాలు 

గాజులరామారం బస్ టెర్మినల్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి

ప్రస్తుతం జగద్గిరిగుట్ట మార్గంలో 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు ప్రతిరోజూ మొత్తం 404 ట్రిప్పులు నిర్వహిస్తున్నాయని, కొత్త బస్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ప్రజా రవాణా మరింత సమర్థవంతంగా మారుతుందని పేర్కొన్నారు.

ప్రతిపాదిత గాజులరామారం బస్ టెర్మినల్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు.

ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్‌ను, నగర బస్సుల కోసం ప్రత్యేక సిటీ బస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను కూడా నిర్మించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

నగరంలోకి రాకుండా అంతర్రాష్ట్ర బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నగరం మధ్యభాగంలోని బస్టాండ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గాజులరామారం నుంచే తమ సేవలను నిర్వహించే అవకాశం ఉంటుంది.

దీంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)లపై ప్రయాణికుల రద్దీ, బస్సుల ఒత్తిడి తగ్గడంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను గణనీయంగా నియంత్రించవచ్చని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ADVERTISEMENT