Loading...
CM Revanth Reddy: చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్‌.. సీఎం రేవంత్‌ ప్రశంసలు
చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్‌.. సీఎం రేవంత్‌ ప్రశంసలు

CM Revanth Reddy: చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్‌.. సీఎం రేవంత్‌ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదు.. భావితరాల భవిష్యత్తును భద్రపరచడం కూడా. ప్రతి చెరువును కాపాడుతూ, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకుంటూ ముందుకు సాగుదామని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఇటీవలి భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉప్పల్‌-బోడుప్పల్‌ మధ్య ఉన్న నల్లచెరువు పూర్తిస్థాయిలో నిండిపోయింది. గతంలో కాలుష్య జలాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో దుర్భరంగా కనిపించిన ఈ చెరువును హైడ్రా అధికారులు ఆక్రమణల నుంచి విముక్తం చేశారు. దాదాపు 10 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచారు. అలాగే పూడిక తొలగించి, చుట్టూ బలమైన కట్ట నిర్మించారు.

వివరాలు

మళ్లీ జలకళను సంతరించుకున్న నల్లచెరువు

చెరువులోకి వరద నీరు చేరే ప్రాంతంలో ప్రత్యేక ఇన్‌లెట్‌తో పాటు రెండు దశల్లో మురుగునీటిని సహజసిద్ధంగా శుద్ధి చేసే కుంటలను ఏర్పాటు చేశారు.

ఈ చర్యల ఫలితంగా నల్లచెరువు మళ్లీ జలకళను సంతరించుకుంది.

హైడ్రా అధికారులు చెరువు అలుగును కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.

ఈ పనుల కోసం సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేశామని, త్వరలోనే సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని చెబుతూ చెరువు తాజా చిత్రాలను ఎక్స్‌లో పోస్టు చేశారు.

దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. "చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్‌ను చూడటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

హైదరాబాద్‌ క్యాచ్‌మెంట్‌ ప్రాంతాలను బాగు చేస్తూ, చెరువులకు జీవం పోస్తూ, భావితరాలకు జీవం నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తోంది.

వివరాలు

వాకింగ్‌ ట్రాక్‌, సైకిల్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌ రానున్నాయి

ఉప్పల్‌ నల్లచెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు, సిబ్బందికి అభినందనలు. ప్రతి చెరువును కాపాడుతూ, ప్రతి అంగుళం ప్రజల ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కొన్నేళ్ల క్రితం వరకు ఉప్పల్‌ నల్లచెరువు అంటే కలుషిత నీరు, దుర్వాసనకు నిలయంగా ఉండేది. ఇప్పుడు వర్షపు నీటితో కళకళలాడుతూ పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంది.

హైడ్రా తొలి దశలో చేపట్టిన ఆరు చెరువుల పునరుజ్జీవ కార్యక్రమాల్లో నల్లచెరువు ఒకటి.

దాదాపు ఏడాదిన్నర క్రితం ఆక్రమణలను తొలగించి, చెరువు మొత్తం విస్తీర్ణంలో 10 అడుగుల లోతు వరకు పూడికను తొలగించారు. దీంతో మరో 25 ఏళ్ల వరకు మళ్లీ పూడిక తొలగించే అవసరం ఉండదని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

చెరువు నీటి నిల్వ సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది

ఈ చర్యల వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని వెల్లడించారు.

చెరువు చుట్టూ 100 అడుగుల వెడల్పుతో కట్ట నిర్మించారు.

దానిపై వాకింగ్‌ ట్రాక్‌, సైకిల్‌ ట్రాక్‌, పూల మొక్కలు, విద్యుద్దీపాలు, ఓపెన్‌ జిమ్‌, పిల్లల పార్కు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.

సందర్శకులు చెరువు చుట్టూ సులభంగా తిరిగేందుకు అలుగు వద్ద వంతెన నిర్మించారు. అలాగే బోటింగ్‌ సదుపాయం కల్పించే ఉద్దేశంతో చెరువు మధ్యలో ప్రత్యేక దీవిని కూడా ఏర్పాటు చేశారు.

చెరువులు కేవలం నీటి నిల్వకే పరిమితం కాకుండా ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదాన్ని అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని హైడ్రా వివరించింది.

ADVERTISEMENT

వివరాలుు

అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం తెలంగాణ: సీఎం

మరో ఎక్స్‌ పోస్టులో రాష్ట్ర అభివృద్ధిపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. అంతకుముందు ఏడాది అది రూ.3,80,031 ఉండగా, ఇప్పుడు రూ.38,900 పెరిగి 10.23 శాతం వృద్ధిని నమోదు చేసింది.

కఠోర శ్రమ, ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి, తాత్కాలిక విధానాల స్థానంలో విధాన ఆధారిత పాలన, నిరంతర సమీక్షలు, భాగస్వాములతో సంప్రదింపుల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైంది.

ADVERTISEMENT