HMWSSB: హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలకు కీలక అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది. పైప్‌లైన్ జంక్షన్ పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో 24 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) వివరాలు వెల్లడించింది. బండ్లగూడ క్రాస్ రోడ్ వద్ద పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల నేపథ్యంలో శనివారం (ఆగస్టు 29) ఉదయం 10 గంటల నుంచి ఆదివారం (ఆగస్టు 30) ఉదయం 10గంటల వరకు ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని జలమండలి తెలిపింది. పనులు పూర్తయిన అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత నీటి సరఫరాను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
ఈ ప్రాంతాల్లో ప్రభావం
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల జాబితాలో శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గా నగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్న నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్ ఉన్నాయి.
24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందుగానే అవసరమైనంత నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.
సరఫరా అంతరాయం కొనసాగే సమయంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.