Hyderabad: హైదరాబాద్‌లో నీటి వృథాపై జలమండలి కొరడా.. సంస్థకు భారీ జరిమానా!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలు చేపడుతోంది. తాగునీటిని దుర్వినియోగం చేస్తున్న వారిపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే నీటి కనెక్షన్లను కూడా తొలగిస్తోంది. తాజాగా ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని ఉపయోగించిన ఓ సంస్థకు రూ.20 వేల జరిమానా విధించింది. అంతేకాకుండా ఆ సంస్థకు ఉన్న తాగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించింది.
వివరాలు
అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్‌కు జరిమానా
జూబ్లీహిల్స్‌లోని అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ సంస్థ ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని వినియోగించినట్లు జలమండలి గుర్తించింది.
దీంతో నిబంధనల ప్రకారం ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు తాగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించింది.
ఇప్పటికే నగరంలో నీటి వృథాపై ప్రత్యేక దృష్టి సారించిన జలమండలి.. పలు పబ్‌లు, హోటళ్లపై కూడా చర్యలు చేపట్టింది. తాగునీటిని అవసరాలకు మించి వృథా చేస్తున్న సంస్థలకు జరిమానాలు విధిస్తోంది.
వివరాలు
నీటి వృథాపై ఫిర్యాదులకు 'పానీ' యాప్
మరోవైపు హైదరాబాద్ మహానగరంలో తాగునీటి దుర్వినియోగం, వృథాపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు జలమండలి ప్రత్యేకంగా 'పానీ' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగరవాసులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నీటిని వృథా చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.
తాగునీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, నీటి వృథాను గుర్తించినప్పుడు వెంటనే జలమండలికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు.