HYDRA: గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా .. కొత్త నిర్మాణాలనే కూలుస్తున్నాం : రంగనాథ్
గత కొన్ని రోజులుగా నగరంలో హైడ్రా వేగంగా దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి మీద హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించి, బుల్డోజర్లతో వాటిని కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పేద ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) లేదా బఫర్ జోన్ పరిధిలో గుర్తించిన కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని ఆయన తెలిపారు. ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఇప్పటికే నిర్మించి, నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలు మాత్రం ఖచ్చితంగా కూలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
బిల్డర్ పై క్రిమినల్ కేసులు.. మాజీ ఎమ్మెల్యేపై కూడా క్రిమినల్ కేసులు
మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి అనుమతులు లేకుండా బఫర్ జోన్‌లో నిర్మాణం చేపట్టినవేనని పేర్కొన్నారు. అలాగే, సున్నం చెరువులో వాణిజ్యపరంగా వినియోగిస్తున్న షెడ్లు కూడా గతంలో కూల్చివేశారని, అయితే, మళ్లీ నిర్మాణాలు చేపట్టడం వల్ల వాటిని ఇప్పుడు కూల్చుతున్నట్లు తెలిపారు. ఓ బిల్డర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు, అలాగే, ఓ మాజీ ఎమ్మెల్యేపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ ప్రజలకు సూచిస్తూ, ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉన్న స్థలాలను లేదా ఇళ్లను కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.