'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు. దిల్లీలోని రామ్ లీలా మైదానంలో శుక్రవారం ప్రారంభమైన జమియాత్ 34వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే ఇస్లాం అతి ప్రాచీనమైనదన్నారు. ఇస్లాం బయటి నుంచి వచ్చిందని చెప్పడం సరికాదన్నారు. భారతదేశం ముస్లింలకు మొదటి మాతృభూమి అని స్పష్టం చేశారు. ఈ దేశంపై ప్రధాని మోదీ , ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌కు ఎంత హక్కు ఉందో, తనకు కూడా అంతే ఉందని మదానీ స్పష్టం చేశారు.
పస్మండ ముస్లింలు వివక్షకు గురవుతున్నారు: మహమూద్ మదానీ
పస్మండ ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారి రిజర్వేషన్ కోసం జమియత్ ఉలామా-ఇ-హింద్ పోరాడుతుందని మహమూద్ మదానీ చెప్పారు. పస్మండ ముస్లింల ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, అయితే ఈ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పస్మండ ముస్లింలకు రిజర్వేషన్ అవసరమని, అయితే కులాల ప్రాతిపదికన జరుగుతున్న అన్యాయానికి చింతిస్తున్నామన్నారు. ప్రతి ముస్లిం సమానమే అని, కుల వివక్షను ఇస్లాంలో అంగీకరించరని మహమూద్ మదానీ వివరించారు. భారీ భూకంపాలతో అల్లాడిపోతున్న టర్కీని ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మహమూద్ మదానీ కృతజ్ఞతలు తెలిపారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ విషయంలో భారత విదేశాంగ విధానం దీర్ఘకాలికంగా దేశానికి లాభదాయకం కాదన్నారు మదానీ. ఇది స్వల్ప ప్రయోజనాలను తీసుకురావచ్చు, కానీ దీర్ఘకాలికంగా సరైనది కాదన్నారు.