LOADING...
DK Shivakumar: 'నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని': రాజీనామా పుకార్లను తోసిపుచ్చిన డికె శివకుమార్
'నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని'

DK Shivakumar: 'నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని': రాజీనామా పుకార్లను తోసిపుచ్చిన డికె శివకుమార్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్ది రోజులుగా సాగుతున్న చర్చల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో కొత్త హడావుడి మొదలైంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తికావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉండి రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరిపారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన పదవికి రాజీనామా చేశారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మీడియా ఈ కథనాలను పెద్దగా ప్రచారం చేస్తుండటంతో, ఈ పుకార్లపై స్వయంగా శివకుమార్ స్పందించారు.

వివరాలు 

త్వరలోనే 100 కొత్త కాంగ్రెస్ కార్యాలయాల శంకుస్థాపన

తాను పార్టీకి కట్టుబడి పనిచేసే వాడినని, రాజీనామా చేస్తున్నానన్న వార్తలు నిరాధారమని స్పష్టం చేశారు. మంత్రివర్గ మార్పులు చేయాలన్నది పూర్తిగా సిద్ధరామయ్య నిర్ణయం మాత్రమేనని, ఇది కూడా పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే జరిగే ప్రక్రియ అని తెలిపారు. తాను ఢిల్లీ వెళ్లినది కేవలం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కర్ణాటక పర్యటనకు ఆహ్వానించడానికే అని శివకుమార్ వివరించారు. రాష్ట్రంలో త్వరలోనే 100 కొత్త కాంగ్రెస్ కార్యాలయాల శంకుస్థాపన జరగబోతుండగా, ఆ కార్యక్రమాలకు నాయకులను ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్ళినట్టు స్పష్టంచేశారు.

వివరాలు 

బ్లాక్‌మేయిల్ రాజకీయాలకు దూరంగా ఉంటా: శివకుమార్ 

''నాకు ముందున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. శంకుస్థాపనలు, ఇతర సమావేశాలు అన్ని ఇవీ నేను చూసుకోవాల్సిందే. అలాంటప్పుడు నేను పదవికి రాజీనామా చేస్తానని ఎందుకు ప్రచారం చేస్తారు? అలాంటి పరిస్థితి అసలు రాలేదు'' అని శివకుమార్ ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాజీనామా ఊహాగానాలు మీడియా తయారుచేసినవేనని, తాను బ్లాక్‌మేయిల్ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ కోసం ఇప్పటివరకు రాత్రింబవళ్లు కష్టపడ్డానని, ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పనిచేస్తానని పేర్కొన్నారు. 2028లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారు.

వివరాలు 

 రాహుల్ గాంధీని కలిసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఇక మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక అంశాలపై ఈ ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే శివకుమార్ రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే శివకుమార్ తాజా ప్రకటనతో ఆ ఊహాగానాలకు ముగింపు పలికినట్టే అయింది.