Loading...
Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్
భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్

Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అయితే తనకు ప్రభుత్వం భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలని కోరాడు. భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు వచ్చి తనపై నమోదైన కేసులను ఎదుర్కొంటానని, కోర్టు విచారణలకు కూడా హాజరవుతానని షకీబ్ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అయిన షకీబ్.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ తరఫున ఎంపీగా కూడా పనిచేశాడు. విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో 2024 ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దీంతో షకీబ్ తన ఎంపీ పదవిని కోల్పోవడంతో పాటు అతడిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి నుంచి అతడు అమెరికాలో ఉంటున్నాడు.

వివరాలు

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం..

ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న షకీబ్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరం కాలేదు.

స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలని, అలాగే 2027 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాడు.

''ప్రభుత్వం నా భద్రతకు హామీ ఇస్తే బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. కోర్టు విచారణతో పాటు అవసరమైన అన్ని ప్రక్రియలను ఎదుర్కొంటాను.

నేను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు'' అని షకీబ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇటీవల షేక్ హసీనా నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ వర్చువల్‌గా పాల్గొన్నాడు.

దీంతో బంగ్లాదేశ్‌లోని అతడి ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేసి భయాందోళనలు సృష్టించారు.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షకీబ్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు

హత్య కేసు నమోదు..

ప్రస్తుతం తనపై రెండు కేసులు ఉన్నాయని షకీబ్ తెలిపాడు. వాటిలో ఒకటి అవినీతి దర్యాప్తుకు సంబంధించిన కేసు కాగా.. మరొకటి 2024 ఆగస్టులో జరిగిన నిరసనల్లో ఓ వ్యక్తి మరణానికి సంబంధించిన హత్య కేసు అని వెల్లడించాడు.

తాను టొరంటోలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే ఈ హత్య కేసు నమోదైందని పేర్కొన్నాడు.

ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తన బ్యాంకు ఖాతాలను 18 నెలలుగా నిలిపివేశారని షకీబ్ చెప్పాడు.

గత పదేళ్లుగా అత్యధిక పన్నులు చెల్లించిన ఆటగాళ్లలో తాను కూడా ఉన్నానని తెలిపాడు.

తనకు సంబంధించిన అవసరమైన అన్ని వివరాలను అధికారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని షకీబ్ స్పష్టం చేశాడు.

ADVERTISEMENT