Loading...
IAF: ఐఏఎఫ్‌ అధికారికి హనీట్రాప్‌.. పాక్‌కు రహస్య సమాచారం చేరవేత!
ఐఏఎఫ్‌ అధికారికి హనీట్రాప్‌.. పాక్‌కు రహస్య సమాచారం చేరవేత!

IAF: ఐఏఎఫ్‌ అధికారికి హనీట్రాప్‌.. పాక్‌కు రహస్య సమాచారం చేరవేత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఓ వింగ్‌ కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాకిస్థాన్‌కు సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ మహిళతో కలిసి ఆయన కుట్రకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

వివరాలు

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం.. హనీట్రాప్‌లోకి?

కొంతకాలం క్రితం వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. స్నేహం పేరుతో ఓ మహిళ వింగ్‌ కమాండర్‌ను హనీట్రాప్‌లోకి లాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెకు ఆయన పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకునేవారు.

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న సదరు మహిళ.. సైనిక కదలికలు, దళాల మోహరింపులకు సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలు, వీడియోలు, ఇతర సున్నితమైన రక్షణ సమాచారాన్ని అందించాలని వింగ్‌ కమాండర్‌ను కోరినట్లు సమాచారం.

ఆమె అడిగిన మేరకు వింగ్‌ కమాండర్‌ డిజిటల్‌ మాధ్యమాల ద్వారా సున్నితమైన పత్రాలు, డేటాను పంపినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఆ సమాచారాన్ని సదరు మహిళ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.

వివరాలు

ఫోన్‌లో స్పైవేర్‌ యాప్‌?

ఆ తర్వాత వింగ్‌ కమాండర్‌ తన ఫోన్‌లో ఓ ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఆ మహిళ సూచించినట్లు సమాచారం.

ఆమె సూచన మేరకు ఆయన ఆ యాప్‌ను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

అయితే అది సాధారణ యాప్‌ కాదని అధికారులు గుర్తించారు. లొకేషన్‌ను ట్రాక్‌ చేయడం, కమ్యూనికేషన్లను అడ్డుకోవడం, డివైజ్‌లోని డేటాను దొంగిలించడం వంటి కార్యకలాపాలకు ఉపయోగించే టార్గెటెడ్‌ స్పైవేర్‌గా దాన్ని గుర్తించినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఐఏఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారంతో అరెస్ట్

ఈ వ్యవహారంపై భారత వైమానిక దళం ఇంటెలిజెన్స్‌ విభాగం దిల్లీ పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి వింగ్‌ కమాండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి పాకిస్థాన్‌కు చేరినట్లు అనుమానిస్తున్న రక్షణ సమాచారంపై అధికారులు మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.

లీక్‌ అయిన సమాచారం వల్ల దేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ హ్యాండ్లర్ల పాత్ర, సదరు మహిళతో వింగ్‌ కమాండర్‌కు ఉన్న సంబంధాలు, ఏయే రహస్య సమాచారాన్ని చేరవేశారు, స్పైవేర్‌ ద్వారా ఎలాంటి డేటా సేకరించబడిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT