Maharashtra: మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై దారుణం.. ముగ్గురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నాగ్‌పూర్ లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భారత వైమానిక దళం (IAF) అధికారికి చెందిన భార్యకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలతో బెదిరించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బాధితురాలు తన భర్తకు విషయం తెలియజేయడంతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2025 ఫిబ్రవరి 8న బాధిత మహిళ నాగ్‌పుర్‌లోని ఓ హోటల్‌లో తన స్నేహితుడు అయాజ్ తాజ్ మదారేను కలిసింది. ఆ సమయంలో అతడు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అది తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం అయాజ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
పలుమార్లు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు
అంతటితో ఆగకుండా, తన స్నేహితులతో కలిసి పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేసిన నిందితులు, విషయం బయటకు చెబితే ఆ చిత్రాలను ఆమె భర్తకు పంపడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, మే 31న బాధితురాలిని కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లిన అయాజ్, ఓ మౌలానా సహాయంతో ఆమె మతాన్ని మార్చించి బలవంతంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
వివరాలు
రూ.4లక్షలు కాజేసినట్లు సమాచారం
ఈ కేసు దర్యాప్తులో ఒక వీడియో కీలక సాక్ష్యంగా మారింది. అందులో నిందితుడు అయాజ్ బాధితురాలికి మత్తుమందు ఇవ్వడం, అనంతరం ఓ ద్రవాన్ని చల్లుతూ హిప్నటైజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు అయాజ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా, నిందితులు బాధితురాలి నుంచి సుమారు రూ.4 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.