LOADING...
Shivangi Singh: రాష్ట్రపతి రఫేల్‌ యాత్రలో 'రఫేల్‌ రాణి'.. ఎవరీ శివాంగీ సింగ్‌..?
రాష్ట్రపతి రఫేల్‌ యాత్రలో 'రఫేల్‌ రాణి'.. ఎవరీ శివాంగీ సింగ్‌..?

Shivangi Singh: రాష్ట్రపతి రఫేల్‌ యాత్రలో 'రఫేల్‌ రాణి'.. ఎవరీ శివాంగీ సింగ్‌..?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించారు. ఈ విశేషమైన అనుభవానికి సంబంధించిన ఫొటోలను ఆమె స్వయంగా ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. వాటిలో ముఖ్యంగా రఫేల్‌ పైలట్‌ శివాంగీ సింగ్‌తో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒకప్పుడు 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాకిస్థాన్‌ ఆమెను బంధించారని తప్పుడు ప్రచారం సాగించడంతో శివాంగీ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రపతి ముర్ముతో ఉన్న ఆ ఫొటో కారణంగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.

వివరాలు 

పాకిస్థాన్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా అసత్య ప్రచారం

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినప్పుడు, పాకిస్థాన్‌ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం విరివిగా సాగింది. భారత రఫేల్‌ యుద్ధ విమానాలను నేలకూల్చామని, ఓ మహిళా పైలట్‌ను పట్టుకున్నామని పాక్‌ అబద్ధాలు పండించింది. ఈ వాదనలను భారత్‌ వెంటనే ఖండించింది. అయితే ఆ తప్పుడు వార్తలతో శివాంగీ సింగ్‌ పేరు అప్పుడు నెట్టింట ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము ఆమెతో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేయడంతో, శివాంగీ పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు ఆమె గురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.

వివరాలు 

వాయుసేనలో 'గోల్డెన్‌ గర్ల్‌' 

శివాంగీ సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందినవారు.అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె, బనారస్‌ హిందూ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందారు. అదే సమయంలో ఎన్‌సీసీలో చేరి సైన్యంలో చేరాలనే ఆసక్తిని పెంపొందించుకున్నారు. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసి వాయుసేనలో అడుగుపెట్టారు. చిన్ననాటి నుంచే ఆకాశంలో ఎగరాలని కలలుగన్నశివాంగీ,పైలట్‌గా మారాలనే లక్ష్యంతో కృషి చేశారు. మొదటి తరం మహిళా యుద్ధ విమాన పైలట్లైన మోహనా సింగ్‌, భావనా కాంత్‌, అవనీ చతుర్వేదిల స్ఫూర్తితో శిక్షణ పొందారు. 2017లో రెండో దశ ఫైటర్‌ పైలట్లలో ఒకరిగా ఎంపికై, మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలపై నైపుణ్యం సాధించారు. ఈ అనుభవమే ఆమెకు 2020లో రఫేల్‌ యుద్ధ విమానం నడిపే అరుదైన అవకాశం తెచ్చిపెట్టింది.

వివరాలు 

'రఫేల్‌ రాణి' బిరుదు ఎలా వచ్చింది? 

అప్పటి నుంచి అంబాలా ఎయిర్‌బేస్‌లోని 'గోల్డెన్‌ యారోస్‌' స్క్వాడ్రన్‌‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2022లో జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్‌లో "భవిష్యత్తు కోసం రూపాంతరం చెందుతున్న భారత వాయుసేన" అనే థీమ్‌తో ఎయిర్‌ఫోర్స్‌ శకటాన్ని ప్రదర్శించారు. అందులో రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ శకటంపై శివాంగీ సింగ్‌ సెల్యూట్‌ చేస్తున్న దృశ్యం దేశవ్యాప్తంగా ప్రజల మనసులు దోచుకుంది. ఆ వేడుకలో పాల్గొన్న రెండో మహిళా పైలట్‌గా ఆమె ఘనత సాధించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఆమెను "రఫేల్‌ రాణి" అని సంబోధిస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవడంతో ఆ బిరుదు ఆమెకు నిలిచిపోయింది.