ICMR backs PM: పెరుగుతున్న డ్రగ్ రెసిస్టెన్స్‌పై ప్రధాని హెచ్చరికకు ఐసీఎంఆర్ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాన్ని లేవనెత్తారు. దేశంలో వేగంగా పెరుగుతున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) పై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక్క మాత్రతో అన్ని రోగాలు నయం అవుతాయన్న అపోహను విడిచిపెట్టాలని ప్రజలకు సూచించారు. ఇటీవల విడుదలైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదికను ప్రస్తావించిన ప్రధాని, ఏ వ్యాధికైనా ఒక్క మాత్ర సరిపోతుందన్న భావన ప్రమాదకరమని తెలిపారు. యాంటీబయోటిక్స్‌ను సరైన అవసరం లేకుండా వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ప్రధాని అభిప్రాయానికి మద్దతు
"డాక్టర్ సూచన లేకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదు. అవి వెంటనే పరిష్కారం కావు" అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందేశం భారత్‌లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే దేశంలో స్వీయ వైద్యం (సెల్ఫ్ మెడికేషన్) సాధారణంగా మారిపోవడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కూడా ప్రధాని అభిప్రాయానికి మద్దతు తెలిపారు. "సులభంగా నయం అవుతాయని అనుకున్న అనేక వ్యాధులు ఇప్పుడు చికిత్సకు లొంగటం లేదు. కారణం సూక్ష్మజీవులు యాంటీబయోటిక్స్‌కు ప్రతిఘటిస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
భవిష్యత్తులో ఔషధాలకు లొంగని వ్యాధుల నుంచి దేశాన్ని కాపాడుకోవచ్చు
జలుబు,ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు డాక్టర్ సలహా లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం పూర్తిగా తప్పని బహల్ తెలిపారు. అలాంటి సందర్భాల్లో యాంటీబయోటిక్స్ ఎలాంటి ఉపయోగం ఉండదని,అవే సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయని చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయని ఆయన ప్రశంసించారు. యాంటీబయోటిక్స్‌ను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకున్న రాష్ట్రాలు మంచి ఉదాహరణగా నిలిచాయని బహల్ వెల్లడించారు. ఈ మందులు కేవలం డాక్టర్ సూచనతోనే ఇవ్వాలన్న నిబంధన అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుకు ఐసీఎంఆర్ మద్దతు లభించడంతో,ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే మందులు వాడితే, భవిష్యత్తులో ఔషధాలకు లొంగని వ్యాధుల నుంచి దేశాన్ని కాపాడుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.