Page Loader
Bhu darsini: రంగులలో 'భూ దర్శిని'.. దేశంలోనే తొలిసారిగా రూపకల్పన
రంగులలో 'భూ దర్శిని'.. దేశంలోనే తొలిసారిగా రూపకల్పన

Bhu darsini: రంగులలో 'భూ దర్శిని'.. దేశంలోనే తొలిసారిగా రూపకల్పన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రవ్యాప్తంగా భూముల వివరాలను ఇంకా స్పష్టంగా,సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. నూతనంగా రూపొందిస్తున్న వెబ్‌ల్యాండ్‌ వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, వాగులు,వంకలు,రహదారుల వంటి సమాచారం వేర్వేరు రంగుల్లో చూపించబడుతుంది. భూమిపై క్లిక్‌ చేయగానే దాని విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం వంటి వివరాలు స్పష్టంగా కనిపించేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. 'భూ దర్శిని' పేరుతో దేశంలోనే తొలిసారి ఈ విధమైన డిజిటల్‌ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇప్పటి వరకు ఉన్న వెబ్‌ల్యాండ్‌ సదుపాయం భూముల విస్తీర్ణం, యజమాని పేరు, భూమి స్వభావం వంటి అంశాలపై మాత్రమే సమాచారం ఇచ్చేది. కొత్త విధానంతో ఆక్రమణలు, రహదారులు, జల వనరులు వంటి అంశాలను కూడా స్పష్టంగా గుర్తించగలిగేలా మార్పులు చేస్తున్నారు.

వివరాలు 

6,690 గ్రామాల్లో రీసర్వే పూర్తి 

రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాలు ఉండగా, వీటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఈ గ్రామాల భూభాగం సుమారు 34,984.18 చదరపు కిలోమీటర్లకు సమానం. ఆధునిక రోవర్ల సాయంతో పొలాల పరిమాణం, హద్దులు, భూముల రకాలను ఖచ్చితంగా కొలుస్తున్నారు. ఈ కొలతల ఆధారంగా డేటాను నమోదు చేసి, ఆటోమేటిగ్గా వెబ్‌ల్యాండ్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నారు.

వివరాలు 

పంచ రంగుల్లో భూ వివరాలు 

రీసర్వే చేసిన గ్రామాల్లో రూపొందించిన కొత్త మ్యాపుల్లో భూములను ఐదు వేర్వేరు రంగుల్లో చూపే విధంగా రూపొందించారు. రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో సమగ్ర సమాచారం ఉండటంతో, ఈ డేటాను ఆధారంగా మ్యాపులను తయారు చేశారు. డ్రోన్‌లు, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూముల చిత్రణను (విజువలైజేషన్‌) రూపొందించడం జరుగుతుంది. వినియోగదారులు భూమిపై క్లిక్‌ చేయగానే తక్షణమే సంబంధిత సమాచారం చూడగలుగుతారు. ఈ విధానం భూ కొనుగోలు, విక్రయాల సమయంలో పక్కా సమాచారం అందించేందుకు ఉపయోగపడుతుంది.

వివరాలు 

ఈ విధానంతో లాభాలు 

భూ హద్దులను ఖచ్చితంగా గుర్తించగలగడం వల్ల ఆక్రమణల సమాచారం సులభంగా తెలుస్తుంది. ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను చక్కగా గుర్తించగలుగుతారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగిన స్థాయిని స్పష్టంగా తెలుసుకోవచ్చు. భూకంపం, వరద, వర్షాభావం వంటి విపత్తుల సమయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకునేందుకు సహాయపడుతుంది. చెరువులు, కుంటలు ఎక్కడున్నాయి? సాగునీటి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వంటి వ్యవసాయ సంబంధిత అంశాలపై స్పష్టత లభిస్తుంది. పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఆయా గ్రామాల్లోని భూముల స్వభావం, సాగు విధానం వంటి విషయాలు ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం అవసరమైన సహజ వనరులు ఆయా గ్రామాల్లో లభ్యత విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు.

వివరాలు 

'క్యూఆర్‌ కోడ్‌'తో కొత్త పట్టాదారు పుస్తకాలు 

ఆగస్టు 15నుంచి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించనున్నారు. ఈ పుస్తకాలలో 'క్యూఆర్‌ కోడ్‌'ను జతచేస్తున్నారు. దీని సాయంతో భూమి వివరాలను మొబైల్‌ ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి తెలుసుకునే సౌలభ్యం కలుగుతుంది. అంతేకాకుండా, నావిగేషన్‌ ఫీచర్‌ సాయంతో రైతు తన భూమి ఉన్న ప్రదేశానికి సులభంగా చేరవచ్చు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌ ఫొటోలతో పాస్‌బుక్స్‌ ముద్రించి పంపిణీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పుస్తకాలను తొలగించి, పూర్వంలాగే రాజముద్రతో ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేయబోతోంది.