LOADING...
Andhra News: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్‌వేర్‌ 
ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్‌వేర్

Andhra News: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్‌వేర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికీ శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబర్లు వెంటనే కేటాయించక రవాణాశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో, ఈ జాప్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, వారం రోజుల్లో సంబంధిత అధికారి శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయించకపోతే, ఆ నంబరు ఆటోమేటిక్‌గా కేటాయించే విధంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలర్‌ షోరూమ్‌లోనే ముందుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరు ఇవ్వబడుతుంది. ఆ వివరాలు వాహన్‌ పోర్టల్‌లో నమోదు అయిన తర్వాత, రెండు లేదా మూడు రోజుల్లో సంబంధిత రవాణాశాఖ అధికారి శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరును కేటాయించాలి.

వివరాలు 

 అధికారులపై  ఫిర్యాదులు 

వాహనదారు ఫ్యాన్సీ నంబరు కోరుకుంటే మాత్రం, గరిష్టంగా ఒక నెలపాటు తాత్కాలిక నంబరుతో వాహనాన్ని నడపడానికి అనుమతి ఉంటుంది. కానీ, ఫ్యాన్సీ నంబరు అవసరం లేని వాహనాలకు మాత్రం వెంటనే శాశ్వత నంబరు ఇవ్వడం తప్పనిసరి. అయితే వాస్తవానికి, అనేక ప్రాంతాల్లో అధికారులు నెలల తరబడి రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయించకుండా జాప్యం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, వాహన డీలర్ల నుంచి రూ.500 నుండి రూ.1,000 వరకు లంచం తీసుకుంటేనే నంబరు ఇస్తామని కొన్ని చోట్ల అధికారులు బేరాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి.

వివరాలు 

వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆటోమేటిక్‌గా నంబరు

జీఎస్టీ తగ్గింపు తర్వాత రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగగా, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పెద్దఎత్తున వాహనాలు విక్రయమయ్యాయి. అయినప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఇంకా శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబర్లు కేటాయించక అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వెల్లడైంది. ఈ పరిస్థితిని సరిచేయడానికి, రవాణా కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తాజాగా చర్యలు ప్రారంభించారు. వారం రోజుల్లో నంబరు కేటాయించని అధికారి ఉన్నట్లయితే, వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆటోమేటిక్‌గా నంబరు కేటాయించేలా మార్పులు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు, సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ బాధ్యతలున్న నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఉన్నతాధికారులకు ఆయన లేఖ పంపారు.