LOADING...
Piyush Goyal: మా ఆఫర్లతో సంతోషంగా ఉంటే.. యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై సంతకం చేయాలి: పీయూష్‌ గోయల్
యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై సంతకం చేయాలి:పీయూష్‌ గోయల్

Piyush Goyal: మా ఆఫర్లతో సంతోషంగా ఉంటే.. యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై సంతకం చేయాలి: పీయూష్‌ గోయల్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి తమకు ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ ట్రేడ్‌ ఆఫర్లు అందాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశవాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తాజాగా స్పందించారు. భారత ఆఫర్ల పట్ల అమెరికా నిజంగానే సంతృప్తిగా ఉంటే, వెంటనే ట్రేడ్‌ ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం

గురువారం గ్రీర్‌ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు గోయల్‌ ఇలా స్పందించారు. "అమెరికా ప్రతినిధి వ్యక్తపరిచిన ఆనందాన్ని స్వాగతిస్తున్నాము. ఆయన చెప్పినట్టుగా మా ప్రతిపాదనలు వారికి నిజంగా నచ్చినట్టయితే, వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే ఖరారు చేయాలి" అని వ్యాఖ్యానించారు. అమెరికాతో ఇప్పటివరకు ఐదు విడతల వాణిజ్య చర్చలు పూర్తయ్యాయని గోయల్ వెల్లడించారు. అలాగే, అక్కడి డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ భారత పర్యటనకు ఈ చర్చలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్విట్జర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ పర్యటన, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా, యూఎస్‌తో వాణిజ్య చర్చలు అనుకూల దిశగా సాగుతున్నాయని తెలిపారు.

వివరాలు 

 టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుకున్న మోదీ -ట్రంప్ 

ఇదిలావుంటే, వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక సంబంధాల్లో జరిగిన పురోగతి, అంతర్జాతీయ పరిస్థితులపై ఇరువురు నేతలు సమీక్షించుకున్నట్లు మోదీ వెల్లడించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్-అమేరికాలు కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని కూడా పేర్కొన్నారు.

Advertisement