Mamata Banerjee: ధైర్యముంటే నాపైకి బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ఈ వార్తాకథనం ఏంటి
తన మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడి చేయడాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. తమకు ఎదురు తిరిగే వారిపైకి బుల్డోజర్లను పంపడం భాజపాకు అలవాటుగా మారిందని విమర్శించారు. బీజేపీ వద్ద ఎన్ని బుల్డోజర్లు ఉన్నా అన్నింటినీ తనపైకి పంపాలని సవాల్ విసిరారు. 'మీ దగ్గర ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయి? రండి.. నేను మీ ముందే నిలబడి ఉన్నాను. నాపై బుల్డోజర్లను నడపండి. మీరెంత ధైర్యవంతులో చూడాలనుకుంటున్నాను' అంటూ భాజపాపై మమత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
కాళీ పూజలకు కూడా ఆటంకాలు
భాజపా తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు చేయడమే కాకుండా, కాళీఘాట్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న కాళీ పూజలకు కూడా ఆటంకాలు కలిగిస్తోందని మమత ఆరోపించారు.
పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని పేర్కొన్నారు. మరికొన్ని చోట్ల ప్రధాన రహదారులపై పూజలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు.
ఈ విధంగా అనుమతుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాగా, శనివారం తెల్లవారుజామున కాళీఘాట్‌లోని తన నివాసంపై భాజపా కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో దాడి చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
ఈ ఘటన నేపథ్యంలోనే మమతా బెనర్జీ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. దాడి ఘటనను ఖండిస్తూ భాజపాపై విమర్శలు గుప్పించారు.