IMD Forecast: ఎండల మధ్య చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వర్షాల సూచన
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా కొంత ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. రాబోయే వారం రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో దక్షిణ, ఉత్తర, ఈశాన్య భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, తాజా అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
దిల్లీలో గాలుల దెబ్బ.. వాతావరణంలో మార్పు
దేశ రాజధాని దిల్లీలో ఈ మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి మే నెల వరకు కొనసాగితే ఎలా ఉంటుందోనన్న భయం కూడా వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో ఆదివారం ఉదయం దిల్లీలో వర్షం కురవడంతో ప్రజలు కొంత ఊరట పొందారు. ఆ తర్వాత రోజంతా అక్కడి వాతావరణం సాధారణంగానే కొనసాగింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమవారం దిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది.
వివరాలు
దిల్లీలో గాలుల దెబ్బ.. వాతావరణంలో మార్పు
పగటి సమయంలో గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగనుండగా, గాలుల వేగం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని తెలిపింది. బుధవారం నాటికి పరిస్థితుల్లో మరింత మార్పు కనిపించే అవకాశం ఉంది. ఆ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన స్వల్ప వర్షం లేదా చినుకులు పడవచ్చని అంచనా. అదే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వివరాలు
హిమాలయాల్లో మంచు.. ఉత్తర రాష్ట్రాల్లో జల్లులు
పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో ఇప్పటికే తాజా హిమపాతం ప్రారంభమైంది. కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో మంచు కురుస్తుండగా, మైదాన ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం మార్చి 15 నుంచి 21 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో విస్తృతంగా తేలికపాటి వర్షాలు లేదా మంచు కురిసే అవకాశం ఉంది.
వివరాలు
ఇతర ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం ఇలా
ఉత్తరప్రదేశ్‌లో మార్చి 16న తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు ఆదివారం కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 15, 16 తేదీల్లో బలమైన గాలులతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన చిరుజల్లుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. లక్నో వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ మార్పులకు కారణమైన 'పశ్చిమ అల్లకల్లోలం' ప్రభావం మార్చి 16 వరకు బలంగా ఉంటుంది. మార్చి 17,18 తేదీల్లో వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అయితే మార్చి 19, 20 తేదీల్లో దీని ప్రభావం మరింత పెరిగి జోధ్‌పూర్, బికనీర్, అజ్మీర్, జైపూర్, భరత్‌పూర్ డివిజన్లలో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఈశాన్య భారత రాష్ట్రాల్లో మార్చి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. మార్చి 15న ఒడిశాలో తీవ్ర ప్రభావం చూపిన సుడిగాలికి కారణమైన అదే వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలకు దారి తీస్తున్నాయని తెలిపింది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరిక
ఈ నేపథ్యంలో అసోం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని ఐఎండీ తన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా సూచించింది. తెలంగాణలో సోమవారం అంటే మార్చి 16, 2026న 14 జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఐఎండీ బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉంది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17 నుంచి వర్షాల ప్రభావం కనిపించనుండగా, ముఖ్యంగా రాయలసీమలో మార్చి 19న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు 40.17 డిగ్రీల వరకు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదే ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.