IMD Yellow Alert: ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రానున్న 5 రోజులు అత్యంత కీలకం..ఐఎండి తీవ్ర హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. మే నెల ఇంకా పూర్తికాకముందే భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ముంబై ప్రాంతాల్లో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. వేడిగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు బయటకు రావడానికే ఇబ్బందులు పడుతున్నారు.
వివరాలు
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదయ్యే సూచనలు
మే 23 వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించింది. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు తరచుగా నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వచ్చే ఐదు రోజుల పాటు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.