LPG shortage: వంటగ్యాస్ కొరత ప్రభావం.. ముంబయిలో 20% హోటళ్లు మూత
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో చమురు, గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత (LPG shortage) కారణంగా ముంబయిలో పరిస్థితి తీవ్రంగా మారింది. వంటగ్యాస్ అందుబాటులో లేకపోవడంతో నగరంలోని సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడినట్లు ముంబయి హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు కూడా మూతపడే ప్రమాదం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది
Details
కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు
ముంబయి మాత్రమే కాకుండా గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత (Commercial LPG Cylinder) కనిపిస్తోంది. దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంటగ్యాస్ అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నారు. సిలిండర్ల కొరత వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు పెరుగుతున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం వినిపిస్తోంది.
Details
21 రోజుల నుంచి 25 రోజులకు పెంపు
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అలాగే వాణిజ్య సిలిండర్ల సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 31.3 మిలియన్ టన్నుల వంటగ్యాస్ వినియోగం జరుగుతోంది. ఇందులో దాదాపు 62 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్మూజ్ జలసంధి మూసివేయబడటంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ప్రస్తుతానికి దేశంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.